జాబ్‌ మేళా నిరంతర ప్రక్రియ

17 Apr, 2022 04:54 IST|Sakshi
అభ్యర్థినికి ఆఫర్‌ లెటర్‌ అందిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

47 వేల మంది అభ్యర్థుల దరఖాస్తు

తొలిరోజే వివిధ సంస్థల్లో 4,784 మందికి ఉద్యోగాలు

తిరుపతి ఎడ్యుకేషన్‌/మంగళం: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్‌ మేళా నిరంతర ప్రక్రియ అని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తొలగిపోయే వరకు కొనసాగిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ వేదికగా రాయలసీమ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశం కల్పించే లక్ష్యంతో రెండు రోజుల మెగా జాబ్‌ మేళాను శనివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దశాబ్దాల పాటు కష్టపడి చదివి ఉద్యోగాల కోసం ఎదురు చూసే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచాలన్నదే ముఖ్యమంత్రి ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా రాష్టంలోని మూడు ప్రాంతాలైన తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులలో  జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్న జాబ్‌మేళాపై కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, అలాంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని కోరారు. ‘సినీ నిర్మాత బండ్ల గణేష్‌ గురించి మాట్లాడి నా వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోను. బుద్దా వెంకన్న బుద్ధి లేని వెంకన్న.. పనికి మాలిన వెధవల గురించి మాట్లాడను’ అని వ్యాఖ్యానించారు.  

4,784 మందికి ఉద్యోగాలు
► తిరుపతిలో నిర్వహిస్తున్న జాబ్‌ మేళాకు రాయలసీమ నుంచి 47 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తొలిరోజు జాబ్‌ మేళాకు పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ తదితర విద్యార్హత కలిగిన అభ్యర్థులు మొత్తం 15,750 మంది హాజరయ్యారు.
► పది, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ విద్యార్హతతో 7,500 మంది హాజరు కాగా, వారిలో 2,347 మంది ఎంపికయ్యారు. డిగ్రీ విద్యార్హతతో 5,700 మంది హాజరు కాగా 1,700 మంది.. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్హత కలిగిన అభ్యర్థులు 737 మంది.. మొత్తంగా 4,784 మంది అభ్యర్థులు వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. 
► ఐటీ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు 737 మందిలో శనివారం సాయంత్రం 410 మందికి ఎంపీలు విజయసాయిరెడ్డి, గురుమూర్తి చేతుల మీదుగా ఆఫర్‌ లెటర్లను అందజేశారు. ఉద్యోగాలు సాధించిన వారందరికీ వారంలోపు ఈమెయిల్, పోస్టు ద్వారా ఆఫర్‌ లెటర్లు అందుతాయి.
► ఇదిలా ఉండగా పచ్చ పత్రికలు నిస్సిగ్గుగా అవాస్తవాలు వల్లిస్తున్నాయని జాబ్‌ మేళా తిరుపతి ఇన్‌చార్జ్‌ దేవేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్‌ ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించారా.. అని ప్రశ్నించారు.  
► జాబ్‌ మేళాలో ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సత్యవేడు, పలమనేరు ఎమ్మెల్యేలు ఆదిమూలం, వెంకటే గౌడ్, ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి, డిజిటల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ చిన్నా వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.

తొలి ప్రయత్నంలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం  
ఉద్యోగాలు లేక ఎదురు చూస్తున్న తరుణంలో జగనన్న పార్టీ తరఫున ఉద్యోగ మేళా నిర్వహించారు. గొప్ప కంపెనీలు ఇక్కడ ఇంటర్వ్యూలు నిర్వహించాయి. మొదటి అటెమ్ట్‌లోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా సెలెక్ట్‌ అయ్యాను. తక్షణమే ఆఫర్‌ లెటర్‌ అందించారు. సంతోషంగా ఉంది.  
– పల్లవి, బద్వేల్‌

నిరుద్యోగులకు వరం
చదువుకొని ఉద్యోగం లేకుండా ఉంటున్న వారికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వివిధ సంస్థల ద్వారా జాబ్‌ మేళా నిర్వహించడం శుభ పరిణామం. నాలాంటి ఎంతో మందికి ఇక్కడ అవకాశం దక్కింది. ఉద్యోగం సంపాదించానని గర్వంగా ఉంది. జగనన్నకు రుణపడి ఉంటా.
– గౌతమి, పుంగనూరు

మంచి అవకాశం
చరిత్రలో ఇప్పటి వరకు ఇలాంటి ఉద్యోగ మేళా ఎవ్వరూ నిర్వహించ లేదు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఇంత పెద్ద జాబ్‌మేళా నిర్వహించడం ఆనందంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ యువకులకు మంచి అవకాశం. జాబ్‌మేళా ద్వారా ఉద్యోగం సంపాదించా. గర్వంగా ఉంది.  
 – చరణ్‌తేజ, నెల్లూరు 

మరిన్ని వార్తలు