నిరంతరంగా జాబ్‌మేళాలు

9 May, 2022 04:31 IST|Sakshi
ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో విజయసాయిరెడ్డి

ఏఎన్‌యూలో రెండ్రోజుల్లో మొత్తం 10,480 మంది ఎంపిక 

మూడు విడతల్లో ఇప్పటివరకు 40,243 ఉద్యోగాల కల్పన 

వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి

సాక్షి, గుంటూరు: రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌  తరఫున జాబ్‌మేళాలు కొనసాగుతాయని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటుచేసిన రెండ్రోజుల వైఎస్సార్‌సీపీ మెగా జాబ్‌మేళా ముగింపు సమావేశంలో ఆదివారం ఆయన మాట్లాడారు. జాబ్‌మేళా నిరంతర ప్రక్రియని, అవకాశం ఉన్న ప్రతిచోటా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు ఇవ్వాలన్నది సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయమని చెప్పారు.  

మూడు విడతల్లో 40,243 మందికి.. 
తిరుపతి, విశాఖపట్నంలో నిర్వహించిన జాబ్‌మేళాల్లో 30 వేలకు పైగా ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఏఎన్‌యూలో నిర్వహించిన జాబ్‌మేళా ద్వారా 10,480 మంది ఉద్యోగాలు పొందారన్నారు. మూడు జాబ్‌మేళాల్లో మొత్తం 40,243 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని, మరో 2వేల మందిని రెండోరౌండ్‌ ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారన్నారు.  

మూడు విడతల్లో 540 కంపెనీల రాక 
మూడు విడతల జాబ్‌మేళాల్లో దాదాపు 540 కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించారని.. వారందరికీ విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. నాలుగో జాబ్‌మేళాను జూన్‌ మొదటి వారంలో వైఎస్సార్‌ కడప జిల్లాలోని యోగి వేమన యూనివర్సిటీలో నిర్వహిస్తామని తెలిపారు. దీంతో మొదటి దశ ముగుస్తుందన్నారు. ఆ తర్వాత రెండో దశను ప్రారంభిస్తామన్నారు.  

గరిష్టంగా రూ.11లక్షల వార్షిక ప్యాకేజీ 
జాబ్‌మేళాలపై విపక్షంతో పాటు, ఒక వర్గం మీడియా విమర్శలు చేస్తున్నాయని, అవన్నీ నైతిక విలువల్లేని వారి విమర్శలుగా విజయసాయిరెడ్డి కొట్టిపారేశారు. జాబ్‌మేళాల్లో చిన్న ఉద్యోగాలు మాత్రమే ఇస్తున్నారన్న విమర్శలో వాస్తవం లేదన్నారు. రూ.15 వేల నుంచి రూ.లక్ష దాకా నెలసరి వేతనంతో ఉద్యోగాలు కల్పించామని, గరిష్టంగా రూ.11 లక్షల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం లభించిందన్నారు. కార్యక్రమంలో మండలి చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు రోశయ్య, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, సోషల్‌ జస్టిస్‌ సలహాదారు జూపూడి ప్రభాకర్, సీఎం సలహాదారు ధనుంజయరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వీసీ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు