‘రేషన్‌ బియ్యం సబ్సిడీ బకాయిలను చెల్లించండి’

9 Nov, 2020 20:22 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రేషన్‌ బియ్యం సబ్సిడీ కింద రాష్ట్రానికి చెల్లించాల్సిన 1,728 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడు వి. విజయసాయి రెడ్డి కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ప్రజా పంపిణీకి వినియోగించే బియ్యం కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం కొంత సొమ్మును సబ్సిడీ కింద రాష్ట్ర పౌర సరఫరాల శాఖ (ఏపీ సివిల్‌ సప్లైస్‌ కార్పోరేషన్‌)కు చెల్లిస్తుంది. ఆ విధంగా చెల్లించాల్సిన మొత్తాల్లో ఇంకా 1,728 కోట్ల రూపాయల మేర బకాయి మిగిలి ఉంది. ఈ మొత్తాన్ని త్వరితగతిన విడుదల చేసి 2020-21 ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు కనీస మద్దతు ధర చెల్లింపుకు సహకరించాలని విజయసాయి రెడ్డి లేఖలో మంత్రికి విజ్ఞప్తి చేశారు. బియ్యం సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్‌కు విడుదల చేయాల్సిన బకాయిలు 2.498 కోట్ల రూపాయలకు చేరడంతో గత ఫిబ్రవరి 21న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి లేఖ ద్వారా ఈ బకాయిల విషయం ప్రధానమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. చదవండి: 'ఎవరికీ కమిషన్లు, వాటాలు ఇవ్వనవసరం లేదు'

ప్రధాని ఆదేశాలతో గత మార్చి 5న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ కొంత మొత్తం విడుదల చేసినప్పటికీ ఇంకా 1,728 కోట్ల రూపాయల బకాయిలు మిగిలి ఉన్నాయి. కోవిడ్‌ మహమ్మారి కారణంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ బకాయిలను త్వరితగతిన విడుదల చేయవలసిందిగా కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత ఏప్రిల్‌ 1న మరోసారి ప్రధాన మంత్రికి లేఖ రాసిన విషయాన్ని విజయసాయి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. బియ్యం సబ్సిడీ బకాయిలు త్వరగా విడుదల చేయడం వలన రైతులకు సకాలంలో కనీస మద్దతు చెల్లింపులతోపాటు స్వయం సహాయ బృందాలు, సహకార సంఘాలను ఆర్థిక వత్తిళ్ళ నుంచి కాపాడవచ్చునని వివరించారు. అలాగే 2020-21 ఖరీఫ్ సీజన్‌కు తగిన ఏర్పాట్లు చేసుకోవడంలో రైతులకు సాయపడవచ్చునని విజయసాయి రెడ్డి తన లేఖలో మంత్రికి వివరిస్తూ సాధ్యమైనంత త్వరగా బియ్యం బకాయిల విడుదలకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. చదవండి: పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా