లోకేష్‌ను చంద్రబాబు నమ్మడం లేదు: విజయసాయిరెడ్డి

30 May, 2022 13:19 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై ఎంపీ విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయసాయిరెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మాట తప్పనిది. 70 శాతం సామాజిక న్యాయం చేశాము. పరిపాలనా సౌలభ్యం కోసం సంస్కరణలు చేసిన ప్రభుత్వం మాది. రూ. 1.42 లక్షల కోట్లు లబ్ధిదారులకు అందించాము. 

రైతుభరోసా వంటి పథకాలతో రైతులకు ప్రభుత్వం చేరువైంది. మహిళా సాధికారతను ప్రభుత్వం చేసి చూపింది. 50 శాతం పదవులు మహిళలకే ఇచ్చాము. 
వైద్య రంగంలో విప్లవాత్మక‌ మార్పులు తీసుకువచ్చాము. విద్యారంగంలో నాడు-నేడు కార్యక్రమంతో స్కూళ్లను అభివృద్ధి చేశాము. చంద్రబాబు తెచ్చిన పథకం చెప్పుకోవటానికి ఒక్కటీ లేదు. మహానాడులో తొడలు కొట్టిస్తున్నాడు. జనంతో బూతులు తిట్టిస్తున్నారు. 

టీడీపీ అంటే తొడలు, దేహం, పార్టీ.  తాగుబోతు అయ్యన్నపాత్రుడు నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు. సీబీఎన్ అంటే చంద్రబాబు నాయుడు కాదు, చంద్రం బూతుల నాయుడు. ఇలా బూతులు తిట్టడమేనా చంద్రబాబు నైజమా?. మిగతావారు తిడుతుంటే చంద్రబాబు శునకానందం పొందుతున్నారు. చంద్రబాబు ఏడ్చినా సింపతీ రాదు. చంద్రబాబు తన కొడుకును నమ్మటంలేదు కానీ, దత్తపుత్రుడునే నమ్ముకుంటున్నారు.  

చంద్రబాబు తనకు తాను అపరచాణక్యుడు అనుకుంటున్నారు. కానీ, ఆయనను జనం చీదరించుకుంటున్నారని తెలుసుకోవటం లేదు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఆయన మనుషులు తప్ప మరెవరూ బాగుపడరు. కానీ, జగన్ పాలనలో అన్ని వర్గాలకూ న్యాయం జరుగుతుంది. 2019లో అందరం ఎలా పని చేశామో 2024లో కూడా అంతకుమించి పని చేసి మళ్ళీ సీఎంగా వైఎస్‌ జగన్‌నే గెలిపించుకుంటాం’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: మహానాడు కాదు.. ఏడుపునాడు

మరిన్ని వార్తలు