ఉపరాష్ట్రపతికి వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ నివేదిక అందించిన విజయసాయి రెడ్డి

15 Jun, 2022 21:12 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వాణిజ్య శాఖ స్టాండింగ్ కమిటీ నివేదికను చైర్మన్ విజయసాయిరెడ్డి అందించారు. ఈ సందర్బంగా మూడు నివేదికలను విజయసాయిరెడ్డి అందించారు. స్టాండింగ్ కమిటీ నివేదికలో కీలక అంశాలను కేంద్ర ప్రభుత్వానికి ఆయన సిఫార్సు చేశారు. 

సిఫార్సులలో 20 కీలక అంశాలు..
1. వన్‌ డిస్ట్రిక్ట్‌ - వన్‌ ప్రొడక్ట్‌ (ఓడీఓపీ) పథకంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఏర్పాటైన నూతన జిల్లాలు చేర్చాలని వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు. ఓడీఓపీలో ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పెంచాలి.

2. ఈ-కామర్స్‌ సంస్థలు డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రొమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ట్రేడ్‌ (డీపీఐఐటీ)లో నమోదు తప్పనిసరి చేయాలి.

 3. టీ బోర్డును పునఃనిర్మాణం చేయాలి.

 4. ఓడీఓపీలో ప్రస్తుతం 733 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. మిగతా జిల్లాలను కూడా ఆ పథకంలో కవర్‌ చేయాలి.

 5. ఓడీఓపీకి సంబంధించి ఎగుమతులు, ఎంఎస్‌ఎంఈ, ఇంటర్‌ మినిస్టీరియల్‌ కో-ఆర్డినేషన్‌ సహా అన్ని సమస్యలు నివేదికలో రూపొందించాలి.

6. వ్యవసాయం, టెక్స్‌టైల్స్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఎంఎస్‌ఎంఈ రంగాల కోసం సంబంధిత మంత్రిత్వశాఖలు /డిపార్ట్‌మెంట్‌ల సెక్రటరీల సాధికారత బృందాన్ని ఏర్పాటు చేయాలని కమిటీ సిఫార్సు. 

 7. క్షేత్రస్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు సమర్థవంతంగా అమలు చేసే క్రమంలో సమన్వయం నిమిత్తం డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కమిటీ (డీఈపీసీ)లు ఏర్పాటు చేయాలి.

8.  దేశీయ ఉత్పత్తులకు లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా తదితర చోట్ల కూడా మార్కెట్‌ దక్కేలా చూడాలి.

9. జిల్లాల్లో గుర్తించిన ఉత్పత్తులు మార్కెటింగ్‌ చేయడానికి పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పీపీపీ) నమూనాలు ప్రారంభించాలి.

10.  ఎంఎస్‌ఎంఈలు ఎక్కువగా అనధికార, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నాయని, తద్వారా ప్రభుత పథకాల ప్రయోజనాలు పొందడానికి సరైన రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ ఉండడంలేదని గమనించిన కమిటీ ఎంఎస్‌ఎంఈలను ఒకే ప్లాట్‌ఫాం మీదకి తీసుకురావడానికి ఆరోగ్యసేతు తరహాలో ఒకే మ్యాపింగ్‌ విధానం తీసుకురావాలి.

11.  డిస్ట్రిక్ట్‌ ఎక్స్‌పోర్ట్‌ హబ్స్‌ (డీఈహెచ్‌) సమర్థంగా పనిచేయడానికి చర్యలు తీసుకోవాలి. 

12. ఓడీఓపీ ఉత్పత్తులకు పెద్ద పెద్ద ఈ-కామర్స్‌ సంస్థలతో భాగస్వామ్యం అయ్యేలా చూడాలి. అంతర్జాతీయ ఉత్పత్తులు గుర్తించి ఎగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలి. 

 13. షాంపైన్‌ ఆఫ్‌ ఇండియాగా పేరొందిన డార్జిలింగ్‌ టీ.. నకిలీ ఎగుమతులు అరికట్టాలని స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. 

14. టీ పరిశ్రమకు రాయితీలు, పెండింగ్‌లు క్లియర్‌చేయాలి.

15. తేయాకు పరిశ్రమలో పనిచేసే కార్మికులకు పర్జాపట్టాలు ఇవ్వాలి. కార్మికులకు మినిమం వేజేస్‌ యాక్ట్‌ వర్తింపజేయాలని పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి సూచన. 

16. కృషి సింఛాయి పథకంలో టీ రంగానికి వర్తింపజేయాలని, తేయాకు బోర్డును పూర్తిగా పునఃనిర్మాణం లేదా తగిన సవరణలు చేయాలి.

17.  డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రొమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌ (డీపీఐఐటీ)లో ఈ-కామర్స్‌ సంస్థలు నమోదు తప్పనిసరి చేయాలి. పెద్దపెద్ద సంస్థల గుత్తాధిపత్యం లేకుండా అన్ని సంస్థలు ఒకే ప్లాట్‌ఫాంలోకి తీసుకురావాలి.

 18. నేషనల్‌ సైబర్‌ క్రైం పాలసీ తీసుకురావాలని, సైబర్‌ సెక్యూరిటీ ఆడిట్‌చేయాలని కమిటీ సిఫార్సు. 

19.  ఈ-కామర్స్‌ పాలసీ తీసుకురావాలి.

20. ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌) తరహాలో ఈ-కామర్స్‌ ఎక్స్‌పోర్ట్‌ జోన్స్‌ పెట్టి ఎగుమతులు ప్రోత్సహించాలి.

మరిన్ని వార్తలు