‘కరోనా పేషెంట్లకు ఆక్సిజన్‌ కొరత లేదు’

1 Sep, 2020 18:31 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణాంతరం విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్‌) ఆస్పత్రిని నిర్లక్ష్యం చేశారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విమ్స్‌ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విమ్స్‌ ఆస్పత్రిలో పేషెంట్లకు అందుకున్న చికిత్స, వసతులపై సమీక్షించామన్నారు. మొదట్లో విమ్స్‌ పట్ల అనేక విమర్శలు వచ్చినప్పటికీ నేడు పాఠశాలలను ఎలా అభివృద్ధి చేశామో అదే నాడు-నేడు తరహాలో విమ్స్‌లో అభివృద్ధి కన్పిస్తుందన్నారు. ఆప్పత్రిలో 12 ఐసీయూ వార్డులు, 10 ఐసోలేషన​ వార్డులు ఉన్నాయని తెలిపారు. (ఏపీలో రెండోసారి కరోనా రాలేదు..)

విమ్స్‌లో వైద్య సిబ్బంది కోరత ఉందని,  సుమారు 320  పారమెడికల్ సిబ్బందితో పాటు, వైద్యుల భర్తీ త్వరలోనే చేపడతామన్నారు. కరోనా రోగులతో ఒక్కొక్కరిగా మాట్లాడామని, ఎవరికి ఆక్సిజన్ కొరత లేదన్నారు. ప్రతి ఒక్కరికి మంచి ఆహారం అందిస్తున్నారని రోగులు సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. అయితే చంద్రబాబు విమ్స్‌ను ప్రైవేట్ పరం చేయాలని అనుకున్నారని, కానీ ఎప్పటికీ విమ్స్ ప్రభుత్వ అధీనంలోనే ఉంటుందన్నారు. విమ్స్‌లో రోగులను పరమర్శించేందుకు గంటపాటు పీపీఈ కిట్‌ ధరిస్తే తనకే ఆక్సిజన్ అందక ఊపిరాడలేదని, అలాంటిది 6 గంటలపాటు పీపీఈ కిట్లు ధరిస్తూ  పనిచేస్తున్న వైద్యుల సేవ మరువలేనిదని కొనియాడారు. విమ్స్ డైరెక్టర్ వరప్రసాద్‌కు, సిబ్బందికి విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. (వైఎస్సార్‌ జిల్లాకు బయలుదేరిన సీఎం జగన్‌)

మరిన్ని వార్తలు