తప్పు చేస్తే నగర బహిష్కరణ

30 Aug, 2020 13:26 IST|Sakshi

రౌడీషీటర్లకు విజయవాడ పోలీసులు హెచ్చరిక

సాక్షి, విజయవాడ: రౌడీషీటర్ల కదలికలపై నగర పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కమిషనరేట్ పరిధిలో 476 మంది రౌడీషీటర్లు, 500 మంది సస్పెట్స్ షీటర్లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్లలో కౌన్సిలింగ్ ఇస్తున్నారు. తుపాకులు, మారణాయుధాలతో రౌడీషీటర్ కొక్కొలగడ్డ జాన్ బాబు పట్టుబడటంతో పెనమలూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. స్టేషన్ పరిధిలో నేర ప్రవృత్తి కల్గిన 140 మందిని సమావేశపరిచి సీఐ సత్యనారాయణ హెచ్చరించారు. దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తే పిడీ యాక్టులు పెట్టి నగర బహిష్కరణ చేస్తామన్నారు. గంజాయి అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రతిఒక్కరి పై సాంకేతిక పరిజ్ఞానంతో నిఘా ఏర్పాటు చేశామని, చిన్న తప్పు చేసినా పట్టేస్తామన్నారు. సత్ప్రవర్తనతో మెలిగితే రౌడీషీట్స్ తొలగించే అవకాశం కూడా ఉందన్నారు. ప్రజా జీవనానికి విఘాతం కల్గిస్తే జైలు జీవితం తప్పదని సీఐ సత్యనారాయణ హెచ్చరించారు.

మరిన్ని వార్తలు