‘ఇంటి దొంగల పనా లేక ప్రొఫెషనల్స్ చేశారా’

18 Sep, 2020 18:06 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఇంద్రకీలాద్రి దుర్గగుడి రథంలోని వెండి సింహాలు చోరీ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. రథం పక్కన పెట్టి ఏడాది పైనే కావస్తుందని, చోరీ ఎప్పుడు జరిగిందో విచారణలో తెలాల్సి ఉందన్నారు. సీపీ మాట్లాడుతూ.. ఆలయాలు, ప్రార్థనా మందిరాలను టార్గెట్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఇంటి దొంగల పనా లేక ప్రొఫెషనల్స్ చేశారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నగరంలో 1,500 పైగా దేవాలయాలు ఉన్నట్టు గుర్తించినట్లు పేర్కొన్నారు. 215 దేవాలయాలకు మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయని, సీసీ కెమెరాలు లేని ఆలయాల్లో  ఆలయ కమిటీలతో సమావేశం ఏర్పాటు చేశామని వెల్లడించారు. (రథంపై సింహాలు మాయం.. పోలీసులకు ఫిర్యాదు)

‘కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాం. పీస్ కమిటీలు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నాం. ‌సీసీ కెమెరాలు, సెక్యూరిటీ ప్రతి ఆలయంలో పెట్టుకోవాలని సూచించాం. అంతర్వేది ఘటన తరువాత వివిధ ఆలయాలపై దాడులు జరిగాయి. వాటన్నిటిపై విడివిడిగా విచారణ జరుగుతుంది. విచారణ అనంతరం వాస్తవాలు బయటకు వస్తాయి. ఆలయాలపై దాడులకు పాల్పడే వారిని ఎవరినీ వదలం. ఆలయాల్లో చోరీలకు పాల్పడే పాత నేరస్థుల కదలిక పైనా నిఘా పెట్టాం’ అని కమిషనర్‌ పేర్కొన్నారు. (సీఎం వైఎస్‌ జగన్‌ కీలక నిర్ణయం)

మరిన్ని వార్తలు