గణతంత్ర వేడుకలకు ముస్తాబు

25 Jan, 2022 04:04 IST|Sakshi

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాట్లు

కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహణ

సాక్షి ప్రతినిధి, విజయవాడ: భారత గణతంత్ర వేడుకలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ స్టేడియం ముస్తాబవుతోంది. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కోవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లను ఎమ్మెల్సీ తలశిల రఘురామ్‌ వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం పరిశీలించి సమీక్ష నిర్వహించారు.

ప్రోటోకాల్‌ డైరెక్టర్‌ బాలసుబ్రహ్మణ్యం, కలెక్టర్‌ జె.నివాస్, జాయింట్‌ కలెక్టర్లు కె.మాధవీలత, మోహన్‌కుమార్, విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్, విద్యుత్, సమాచార పౌర సంబంధాలు, రెవెన్యూ, పోలీస్‌ తదితర శాఖల అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. పరేడ్‌కు సంబంధించిన రిహార్సల్స్‌ను మంగళవారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి డీజీపీ గౌతంసవాంగ్, ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరవుతారు. కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి ఈ వేడుకలకు 200 మంది అతిథులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. 

16 శకటాల ప్రదర్శన
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించేందుకు 16 శకటాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే ఈ శకటాలను రాష్ట్ర సమాచార పౌర సంబంధాల కమిషనర్‌ టి.విజయకుమార్‌రెడ్డి పరిశీలించి పలు సూచనలు చేశారు. జాతీయ జెండా రంగులతో స్టేడియాన్ని అందంగా తీర్చిదిద్దారు. వేడుకల్లో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. గణతంత్ర వేడుకలను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ టీకే రాణా తెలిపారు.  

మరిన్ని వార్తలు