స్వర్ణకవచాలంకారంతో కరుణించిన కనకదుర్గ 

8 Oct, 2021 04:14 IST|Sakshi
స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తున్న శ్రీకనకదుర్గ అమ్మవారు

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం 

అమ్మవారికి తొలిపూజ చేసిన గవర్నర్‌ దంపతులు 

రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు 

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు కనకదుర్గమ్మ.. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహించింది. గురువారం తెల్లవారుజామున మూడు గంటలకు వేదపండితులు, అర్చకుల సుప్రభాతసేవతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శాస్త్రోక్తంగా స్నపనాభిషేకం, బాలభోగ నివేదన చేసిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వాణీమోహన్, విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు, ఆలయ చైర్మన్‌ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ తొలిదర్శనం చేసుకున్నారు.

రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులు అమ్మవారికి తొలిపూజ చేశారు. గవర్నర్‌ దంపతులకు మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ఈ ఉత్సవాలను జరుపుతున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పక్కా ప్రణాళికతో, కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేశారు. కోవిడ్‌ ఉపశమనంతో రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. కృష్ణమ్మ చెంత పులకించిపోయారు. అయితే ప్రభుత్వం ఈసారి కూడా నదీస్నానాలకు అనుమతించలేదు. సీతమ్మవారి పాదాల వద్ద కేశఖండనశాలను ఏర్పాటు చేశారు. భక్తులు అక్కడే జల్లు స్నానాలు చేసేందుకు 300కు పైగా షవర్లను ఏర్పాటు చేశారు. తాత్కాలిక మరుగదొడ్లు, మూత్రశాలలు ఏర్పాటుచేశారు. 

భక్తులకు ఉచిత ప్రసాదం 
అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు ఉచితంగా ప్రసాదాలను అందజేశారు. క్యూలైన్లలో తాగునీటి ఏర్పాట్లు చేశారు. పిల్లలకు పాలు, వృద్ధులకు బిస్కెట్‌ ప్యాకెట్‌లు ఇచ్చారు. ఏర్పాట్లను కలెక్టర్‌ జె.నివాస్, సీపీ శ్రీనివాసులు పర్యవేక్షించారు. పల్లకీసేవ, పంచహారతులు భక్తులను పరవశింపజేశాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. 

కరోనా నుంచి ఉపశమనం కలగాలి: గవర్నర్‌ 
నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవటం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ చెప్పారు. అమ్మవారిని దర్శించుకుని తొలిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నుంచి ప్రజలకు ఉపశమనం లభించాలని దుర్గమ్మను ప్రార్థించినట్టు తెలిపారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందంగా జరుపుకోవాలన్నారు. భక్తులకు అన్ని సౌకర్యాలను అందుబాటులో ఉంచాలని ఆలయ అధికారులను ఆదేశించారు. 

అమ్మవారిని దర్శించుకున్న న్యాయమూర్తులు, ప్రముఖులు 
ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ మానవేంద్రనాథ్‌రాయ్, జస్టిస్‌ కృష్ణమోహన్, జస్టిస్‌ రఘునందనరావు, జస్టిస్‌ శివశంకర్‌ దర్శించుకున్నారు. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిని దర్శించుకున్నవారిలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీ పి.కల్పలతారెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి తదితరులున్నారు.  

మరిన్ని వార్తలు