అత్యధిక సోలార్‌ ఉత్పాదక స్టేషన్‌గా విజయవాడ

1 Jul, 2021 03:14 IST|Sakshi
విజయవాడ స్టేషన్‌లో ప్లాట్‌ఫారాలపై సోలార్‌ ప్యానల్స్‌తో వేసిన పైకప్పులు

భారతీయ రైల్వేలోనే అరుదైన రికార్డు

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): విద్యుత్‌ ఆదాలో విజయవాడ రైల్వే డివిజన్‌ మరో అడుగు ముందుకేసింది. విజయవాడ రైల్వే స్టేషన్‌లో అదనంగా రూ.62 లక్షలతో మరో 65 కిలో వాట్స్‌ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్‌ ప్యానల్స్‌తో ప్లాట్‌ ఫారాల పైకప్పులు ఏర్పాటు చేయడం ద్వారా భారతీయ రైల్వేలోనే తొలిసారిగా 130 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ విద్యుదుత్పత్తి గల స్టేషన్‌గా విజయవాడ రికార్డు సృష్టించింది.

బుధవారం డీఆర్‌ఎం శ్రీనివాస్‌ స్టేషన్‌లోని సోలార్‌ విద్యుదుత్పత్తి యూనిట్‌ను ప్రారంభించారు. 2019 డిసెంబర్‌లో 4, 5 ప్లాట్‌ఫారాలపై 65 కిలోవాట్స్‌ సామర్థ్యం గల బీఐపీవీ సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. వాటికి అదనంగా మరో 54 కిలోవాట్స్‌ సోలార్‌ ప్యానల్స్‌ను 4, 5 ప్లాట్‌ఫారాలలో,  11 కిలోవాట్స్‌ సోలార్‌ ప్యానల్స్‌ను 8, 9 ప్లాట్‌ఫారాలలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా స్టేషన్‌ అవసరాలకు వినియోగించే విద్యుత్‌ సరఫరాలో ఏడాదికి 2.12 లక్షల యూనిట్లను తగ్గించడం ద్వారా ఏడాదికి రూ.16.36 లక్షలు ఆదా అవుతుంది. 

మరిన్ని వార్తలు