నచ్చినవాడి కోసం 2600 కి.మీ వచ్చిన యువతి

8 Jan, 2021 17:33 IST|Sakshi

ఆంధ్ర టు అఫ్గానిస్తాన్‌ వయా ‘ప్రేమ’

వైరలవుతోన్న ఆంధ్ర-అఫ్గానిస్తాన్‌ జంట పెళ్లి ఫోటోలు

సాక్షి, విజయవాడ: ప్రేమకు కులం, మతం, ప్రాంతంతో పని లేదు. ఆస్తి, అంతస్తు అక్కర్లేదు. మనసుకు నచ్చితే చాలు. అది చేసే మాయ ముందు ఈ కట్టుబాట్లు, అంతరాలు, ఆచరవ్యవహరాలు తేలి పోతాయి. కేవలం ప్రేమ మాత్రమే మిగులుతుంది. దానికి ఎల్లలు ఉండవు.. దూరభారాన్ని పట్టించుకోకుండా.. సరిహద్దులు కూడా దాటుతుంది. కావాల్సింది రెండు మనసుల్లో నిజమైన ప్రేమ. అంతే ఆ ఒక్కటి చాలు వారు ఏకం కావడానికి.. వివాహ బంధంతో నిండు నూరేళ్లు కలిసి బతకడానికి. ఇప్పుడి ప్రేమ జపం ఎందుకంటే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో‌ ఓ ప్రేమ వివాహం జరిగింది. అందులే వింతేముంది అనుకుంటున్నారా. ఉంది.. ఏంటంటే అబ్బాయిది ఏపీ.. అమ్మాయిది మనకు 2600 కిలో మీటర్ల దూరంలో ఉన్న అఫ్గానిస్తాన్. కానీ ఇవేవి వారి ప్రేమను ఆపలేకపోయాయి. పెద్దలు కూడా అంగీకరించడంతో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. (చదవండి: భాగ్య పెళ్లి.. ప్రతి ఒక్కరినీ కదిలించింది..)

ఆ వివరాలు.. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన రైల్వే డీఎస్పీ అశోక్ కుమార్, లక్ష్మీ మహేశ్వరిల కుమారుడు వివేకానంద రామన్.., బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఢిల్లీలో చదువుకునే రోజుల్లో తన క్లాస్‌మెట్‌ అయిన అఫ్గానిస్తాన్ అమ్మాయి ఫ్రోజ్ షరీన్‌ను ప్రేమించాడు. అమ్మాయి కూడా ప్రేమను అంగీకరించడంతో ఉద్యోగాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకోవాలని భావించారు. అనుకున్నట్లుగానే ఇద్దరు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆ తర్వాత ప్రేమ విషయాన్ని ఇద్దరూ తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు తొలుత కొంత ఆలోచించినా చివరకు ఒప్పుకున్నారు. దీంతో ఇరు కుటుంబాలు దగ్గరుండి అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిపించాయి. హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహంలో మంగళవాయిద్యాలు, మంత్రోచ్ఛరణ మధ్య వేవిక్.. షిరీన్ మెడలో మూడు ముళ్లు వేశాడు. షిరిన్ కూడా అచ్చతెలుగు పెళ్లికూతురు లాగా ముస్తాబై సిగ్గులమొగ్గయ్యింది. (వింత వివాహం: ఓ వరుడు.. ఇద్దరు వధువులు)

తమకు కుల మతాల పట్టింపులు లేవని అందుకే మన దేశానికి చెందిన అమ్మాయి కాకపోయినా తనని పెళ్లి చేసుకున్నానని వివేక్ తెలిపారు. కలిసి జీవించేది పిల్లలు కాబట్టి వారి ప్రేమను అర్ధం చేసుకోని పెళ్లికి అంగీకరించినట్లు డీఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు కూడా సంతోషంగా అంగీకరించారని చెప్పారు.

మరిన్ని వార్తలు