నాగేంద్రకు ఉరిశిక్ష పడాలి

24 Oct, 2020 19:33 IST|Sakshi

మార్ఫింగ్ ఫోటోలు పెట్టి తప్పుదారి పట్టించాడు

శిక్ష నుంచి తప్పించుకునేందుకు కట్టుకథలు

నిజాన్ని బయటకు రాకుండా ఆపలేరు

‘సాక్షి’తో దివ్య తేజస్విని తల్లితండ్రులు

సాక్షి, విజయవాడ: తమ ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఉన్మాది నాగేంద్రకు బతికే అర్హతలేదని, నేరాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించి అతడికి ఉరిశిక్ష పడేలా చూడాలని దివ్య తేజస్విని తల్లితండ్రులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా దివ్య తల్లితండ్రులు శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నిజం నిప్పులాంటిదని దాన్ని బయటకు రాకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర)

తమ బిడ్డను కిరాతకంగా హత్య చేయటమే కాక మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అందరినీ నాగేంద్ర తప్పుదారి పట్టించాడని వాపోయారు.  పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో దివ్యది హత్యే అని తేలిందని, తాము మొదటినుంచీ చెబుతున్నదే నిపుణుల రిపోర్టులో వచ్చిందని తెలిపారు. అబద్దం చెప్పి తప్పించుకొనేందుకు నాగేంద్ర కట్టుకథలు చెబుతున్నాడన్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశారు. 

ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతున్న దివ్య తేజస్విని ఈ నెల 15న నాగేంద్ర జరిపిన కత్తి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నాగేంద్ర తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. అయితే దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామన్నాడు. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికలు రావడంతో అతడు చెప్పింది అబద్ధమని తేలిపోయింది. 

చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు

మరిన్ని వార్తలు