విజయవాడ శ్రీచైతన్య కాలేజీ గుర్తింపు రద్దు

15 Oct, 2022 08:28 IST|Sakshi

విద్యార్థిపై దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్‌

ఇప్పటికే అధ్యాపకుడిపై క్రిమినల్‌ కేసు నమోదు

మచిలీపట్నం: ఎన్టీఆర్‌ జిల్లా విజయవాడ బెంజి సర్కిల్‌ సమీపంలోగల శ్రీచైతన్య (భాస్కర్‌భవన్‌ క్యాంపస్‌) జూనియర్‌ కాలేజీ గుర్తింపును రద్దు చేస్తూ ఇంటర్మీడియెట్‌ బోర్డు కమిషనర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని ఉమ్మడి కృష్ణాజిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి రవికు మార్‌ ధ్రువీకరించారు. శ్రీచైతన్య జూనియర్‌ కాలేజీ గుర్తింపు రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులను ప్రత్యామ్నాయంగా ఇతర కాలేజీలకు సర్దుబాటు చేయాలని స్పష్టం చేశారు.

విద్యార్థుల అభీష్టం మేరకు వారికి నచ్చిన కాలేజీలో అడ్మిషన్‌ తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్మీడియెట్‌ చదువుతున్న విద్యార్థిపై కాలేజీ అధ్యాపకుడు పరుష పదజా లంతో విరుచుకుపడటమే కాకుండా చేయిచేసుకో వడం తెలిసిందే. ఆ ఘటనపై చిత్రీకరించిన వీడి యో సామాజిక మాధ్యమాల్లో వైరలైంది. దీనిపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించింది. కేంద్ర విద్యాశాఖ సైతం దీనిపై జోక్యం చేసుకుని కలెక్టర్‌ను నివేదిక కోరింది.

ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఘటనకు పా ల్పడిన అధ్యాపకుడిపై ఇప్పటికే క్రిమినల్‌ కేసు నమోదుచేశారు. తాజాగా, కాలేజీ యాజమాన్యంపై చర్యలకు ఉపక్రమించడంతోపాటు కాలేజీ గుర్తింపు రద్దు చేశారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు కాలేజీకి మూతవేస్తామని, విద్యార్థులకు ఎక్కడా నష్టం కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తామని ఆర్‌ఐవో పి.రవికుమార్‌ తెలిపారు. విద్యార్థులకు ర్యాంకుల బూచి చూపించి హద్దు మీరి ప్రవర్తిస్తే ఎంతటి వారిపై అయినా కఠిన చర్యలు ఉంటాయన్నారు.

మరిన్ని వార్తలు