పాలనలో ప్రవీణ్‌ ముద్ర 

19 May, 2022 07:42 IST|Sakshi
సూర్య సాయి ప్రవీణ్‌చంద్‌

ప్రభుత్వాస్పత్రి ప్రక్షాళనకు కృషి 

ఎరువుల అక్రమాలను వెలుగులోకి.. 

విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ కడపకు బదిలీ

సాక్షి, విజయవాడ: ప్రజా సమస్యలను సత్వరం ఎలా పరిష్కరించవచ్చో.. పారదర్శకంగా పని చేస్తే ఎలాంటి ఫలితాలొస్తాయో.. చేసి చూపించారాయన. మారువేషంలో వెళ్లి అక్రమాలు బట్టబయలు చేశారు. అర్ధరాత్రి ఆస్పత్రులు సందర్శించారు. ఏడాది పాలనలో విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా యువ ఐఏఎస్‌ అధికారి జి.సూర్య సాయి ప్రవీణ్‌ చంద్ర పాలనలో తనదైన ముద్ర వేశారు. ప్రజల సమస్యలపై సత్వరమే స్పందించి, వాటి పరిష్కారానికి కృషి చేశారు.
 
ప్రభుత్వాస్పత్రి ప్రక్షాళన.. 
విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారు. అర్ధరాత్రి ఆస్పత్రిని సందర్శించడం, ఉదయం 6 గంటలకు, రాత్రి 10 గంటలు ఇలా అన్ని వేళల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వైద్య సేవల్లో పురోగతికి కృషి చేసారు. కోవిడ్‌ సమయంలో ఐసోలేషన్‌ వార్డుల్లోకి వెళ్లి, అక్కడ కోవిడ్‌ రోగులకు అందుతున్న సేవలను వారినే అడిగి తెలుసుకున్నారు. కొత్తగా సూపర్‌స్పెషాలిటీ విభాగాలు తీసుకు రావడం, పోస్టులు మంజూరు వంటి అంశాల్లో ఎంతో కృషి చేసారు. తన పాలనతో ప్రభుత్వాస్పత్రిని ప్రక్షాళన చేసారు.  

చదవండి: (పరిశ్రమలకు 'పవర్‌' ఫుల్‌)

ఎరువుల అక్రమాలకు అడ్డుకట్ట...
విజయవాడ సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలినాళల్లో మారువేషంలో వెళ్లి ఎరువుల అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. నాటి కలెక్టర్‌ నివాస్‌ ఆదేశాలతో  కైకలూరులో రైతు వేషంలో బైక్‌పై ఎరువుల దుకాణానికి వెళ్లి , వారి అక్రమాలను బట్టబయలు చేశారు.   

స్పందన అర్జీలకు సత్వర పరిష్కారం.. 
ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో తనకు వచ్చే అర్జీలపై సత్వరమే స్పందించి చర్యలు తీసుకునే వారు. దీంతో సబ్‌కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌కు అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందని భావించిన ప్రజలు పెద్ద ఎత్తున స్పందనలో వినతులు ఇచ్చేందుకు వచ్చేవారు. ప్రస్తుతం సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ వైఎస్సార్‌ కడప నగరపాలక సంస్థ కమిషనర్‌గా బదిలీపై వెళ్లనుండటంతో ఆయన చేసిన సేవలను పలువురు కొనియాడుతున్నారు.  

మరిన్ని వార్తలు