ఆయనే విద్యార్థి.. ఆయనే గురువు

1 Oct, 2021 14:05 IST|Sakshi

 విద్యార్థి మృతి ఘటన విచారణలో భాగంగా ట్యాంక్‌ ఎక్కిన విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌

ప్రమాదంపై స్వయంగా పోస్ట్‌మార్టం 

ఆపై గురువుగా మారి తరగతి గదిలో పాఠాలు బోధన 

విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం

నందిగామ: ఆయనో అధికారి.. విద్యార్థి మృతి ఘటనలో విచారణకు నందిగామ జెడ్పీ ఉన్నత పాఠశాలకు వచ్చారు. ‘విద్యార్థి ట్యాంక్‌ పైకి ఎలాఎక్కాడు? పాఠశాలకు మెట్లున్నాయా? ట్యాంక్‌కు అంత దగ్గరలో విద్యుత్‌ లైన్లు వెళ్లడం ఏమిటి’ అంటూ పాఠశాల సిబ్బంది, స్థానిక అధికారులపై ప్రశ్నల వర్షం కురిపిస్తూనే.. పదండి ఆ ట్యాంక్‌ను చూద్దాం.. అంటూ బయటకొచ్చి.. చకచకా గోడ ఎక్కేశారు. ఆపై ట్యాంక్‌ వద్దకు చేరుకుని.. ప్రమాదం జరిగిన తీరుపై స్వయంగా అవగాహనకొచ్చారు. ఇదంతా కింద నుంచి చూస్తున్న ఇతర అధికారులు అవాక్కవ్వడం వారి వంతైంది. ఇంతకీ ఎవరు ఈ అధికారి అనుకుంటున్నారా.. గతంలో ఓ రైతు వేషంలో ఎరువుల దుకాణానికి వెళ్లి అక్కడ జరుగుతున్న మోసాలను బయటపెట్టారు గుర్తుందా.. ఆయనే విజయవాడ సబ్‌ కలెక్టర్‌ జి. సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌. 

చదవండి: (అమ్మా కృష్ణవేణి వస్తే నా శవాన్ని ముట్టకోనివ్వద్దు..)

వివరాలు ఇవీ.. 
పట్టణ శివారుల్లోని అనాసాగరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన గోపీచరణ్‌ అనే విద్యార్థి ఆగస్టు 25వ తేదీన పాఠశాల పైభాగంలో వాష్‌రూమ్‌లపై గల నీటి ట్యాంక్‌ను కడిగేందుకు ట్యాంక్‌ పైకి వెళ్లి, విద్యుత్‌ షాక్‌తో మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విచారణ నిమిత్తం గురువారం పాఠశాలను విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌చంద్‌ పాఠశాలను సందర్శించారు. ఈ క్రమంలో అసలు సంఘటన ఎలా జరిగింది? అన్న విషయాన్ని నిర్థారించేందుకు స్వయంగా తానే ట్యాంక్‌పైకి ఎక్కారు. 

లెక్కల మాస్టారుగా.. 
అనంతరం విద్యార్థులతో కొద్దిసేపు మాట్లాడిన సబ్‌ కలెక్టర్‌ వారికి గణిత బోధన చేయడంతోపాటు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. సబ్‌ కలెక్టర్‌ వెంట డీఈఓ తాహెరా సుల్తానా, తహసీల్దార్‌ చంద్రశేఖర్, ఎంఈఓ బాలాజి, డెప్యూటీ తహసీల్దార్‌ రిబ్కా రాణి, ఎస్‌హెచ్‌ఓ కనకారావు ఉన్నారు.

చదవండి: (సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్‌ సమీక్ష)

మరిన్ని వార్తలు