ధర్మ ప్రచార కేంద్రంగా ‘అరసవల్లి’ 

27 Feb, 2023 04:33 IST|Sakshi
కంచి పీఠాధిపతికి జ్ఞాపికను అందజేస్తున్న ఆలయ ఈవో, ప్రధానార్చకులు

కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి 

పీఠాధిపతి హోదాలో తొలిసారిగా ఆదిత్యుడిని దర్శించుకున్న స్వామీజీ 

అరసవల్లి: హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, అటు విశాఖ నుంచి ఇటు ఒడిశా వరకు అరసవల్లి సూర్య క్షేత్రం ధర్మ ప్రచార కేంద్రంగా విరాజిల్లే అవకాశముందని కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి అన్నారు. ఆయన ఆదివారం పీఠాధిపతి హోదాలో తొలిసారి శ్రీకాకుళంలోని అరసవల్లి ఆదిత్యుడిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో వి.హరిసూర్యప్రకాష్, ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలికారు.

అనంతరం గర్భాలయంలో ఆదిత్యుడికి శంకర విజయేంద్ర సరస్వతి పూజలు నిర్వహించారు. తర్వాత అనివెట్టి మండపంలో భక్తులను ఉద్దేశించి అనుగ్రహభాషణం చేశారు. శనివారం నారాయణుడిని (శ్రీకూర్మం), ఆదివారం సప్తమి నాడు సూర్యనారాయణుడిని దర్శించుకోవడం అదృష్టమని వ్యాఖ్యానించారు. నేపాల్‌ యాత్రలో భాగంగా 1985లో నాటి కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతితో కలిసి అరసవల్లికి తొలిసారిగా వచ్చానని, అయితే అప్పటికీ ఇప్పటికీ ఆలయంలో అద్భుత మార్పులు వచ్చాయని చెప్పారు.

ఈ కళింగ ప్రాంతంలో ధర్మ ప్రచారం దీక్షగా చేయాలని, ఇలాంటి క్షేత్రాన్ని ధర్మ ప్రచార కేంద్రంగా అభివృద్ధి చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు ఇప్పిలి నగేష్‌ కాశ్యప శర్మ, రంజిత్‌ శర్మ, ఫణీంద్ర శర్మ, షణ్ముఖ శర్మ తదితరులు పాల్గొన్నారు. పాలక మండలి సభ్యులు మండవల్లి రవి, డాక్టర్‌ కొంచాడ సోమేశ్వరరావు, ఎన్‌.కోటేశ్వర చౌదరి, మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు