గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు ప్రారంభం

20 Sep, 2020 03:20 IST|Sakshi

కరోనాలోనూ అన్ని జాగ్రత్తల మధ్య ఉద్యోగాల భర్తీపైనే ప్రభుత్వం శ్రద్ధ

నేటి నుంచి గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగ రాతపరీక్షలు

గతేడాది ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాల భర్తీతో రికార్డ్‌

ప్రస్తుతం 16,208 పోస్టులకు రాతపరీక్షలు మొదలు

నాడు 21.69 లక్షల మంది.. ఇప్పుడు 10.56 లక్షల మంది దరఖాస్తు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 26 వరకూ పరీక్షలు కొనసాగనున్నాయి. 16,208 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ఆదివారం ఉదయం నుంచి రాతపరీక్షలు ఆరంభం అయ్యాయి. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోపే గతేడాది దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకేసారి 1.34 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరో ఏడాది కూడా పూర్తికాక ముందే మరోసారి భారీ సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అందులోనూ కరోనాతో ఆర్థికంగా మందగమన పరిస్థితులు ఉన్నప్పటికీ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. కరోనా నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు అన్ని జాగ్రత్తలతో పటిష్ట ఏర్పాట్లు చేసింది. దీంతో రాష్ట్రంలో నిరుద్యోగ యువత ముఖాల్లో ఇప్పుడు వెలుగులు కాంతులీనుతున్నాయి. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక వరుసగా వేలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుండటమే ఇందుకు కారణం.

భర్తీ ప్రక్రియలోనూ వేగమే.. 
► గతేడాది గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసిన 35 రోజులకే రాతపరీక్షలు నిర్వహించడంతోపాటు 11 రోజులకే ఫలితాలను కూడా ప్రకటించింది. అంతేకాకుండా మరో పది రోజుల్లోనే ఉద్యోగాలన్నింటినీ భర్తీ చేసింది.  
► రెండు విడతల్లో భర్తీ చేసిన/చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాలన్నీ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కొత్తగా సృష్టించి, మం జూరు చేసినవే కావడం గమనార్హం. 
► అధికారిక లెక్కల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చాక గత 72 ఏళ్లలో జరిగిన నియామకాల ద్వారా రాష్ట్రంలో ఇప్పుడున్న మొత్తం ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య సుమారు ఐదు లక్షలు కాగా ఇందులో నాలుగో వంతుకు సమానమైన ప్రభుత్వ ఉద్యోగాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వమే సృష్టించడం విశేషం. 

పూర్తి పారదర్శకంగా.. 
► ప్రభుత్వం కొత్త ఉద్యోగాలను సృష్టించడంతోపాటు వాటిని అత్యంత వేగంగా, ఎ లాంటి వివాదాలకు, దళారులకు ఆస్కా రం లేకుండా పారదర్శకంగా భర్తీ చేస్తోంది. 
► దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు ఉద్యోగ నియామక ప్రక్రియలో ప్రభుత్వం ఇంటర్వ్యూలు లేకుండా చేసింది. 
► కేవలం రాతపరీక్షల్లో అభ్యర్థులకు వచ్చే మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ, రిజర్వేషన్లను పాటిస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. 
► గతేడాది 1.34 లక్షల ఉద్యోగాలకు 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఇప్పు డు 16,208 పోస్టులకు మొత్తం 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు. 

నేటి నుంచి 26 వరకు రాతపరీక్షలు 
► రాష్ట్రంలో ఆదివారం నుంచి ఈ నెల 26 వరకు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల భర్తీకి రాతపరీక్షలు జరుగుతాయి.  
► 19 కేటగిరీల్లో రోజుకు రెండు పరీక్షల చొప్పున నిర్వహిస్తారు.  
► మొత్తం 2,221 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  
► కరోనా నేపథ్యంలో పరీక్ష కేంద్రాల్లో ఒకరికొకరి మధ్య ఆరడుగుల దూరం ఉండేలా సీటింగ్‌ ఏర్పాటు చేశారు.  
► బెంచ్‌కు ఒకరి చొప్పున ప్రతి పరీక్ష గదిలో 16 మంది అభ్యర్థులను మాత్రమే ఉంచుతారు.  
► రాతపరీక్షకు ముందు, పరీక్ష అనంతరం అన్ని పరీక్ష కేంద్రాలను సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణంతో శానిటైజ్‌ చేయిస్తున్నా మని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ తెలిపారు.  
► ప్రతి పరీక్ష గది ముందు శానిటైజర్‌ స్టాండ్‌లు అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కరోనా అనుమానిత లక్షణాలున్నవారికి ప్రత్యేక ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేశామని చెప్పారు.  
► రోజూ ఉదయం జరిగే పరీక్ష పది గంటలకు, సాయంత్రం పరీక్ష మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమవుతాయన్నారు.  
► నిర్ణీత సమయానికి నిమిషం ఆలస్యం అయినా రాతపరీక్షకు అనుమతించబోమని చెప్పారు.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా