గ్రామస్థాయికి భూముల సర్వే సేవలు

27 Dec, 2022 04:31 IST|Sakshi

ఎఫ్‌ లైన్‌ పిటిషన్ల బాధ్యత గ్రామ సర్వేయర్లకు

మండల సర్వేయర్ల నుంచి ఆ బాధ్యతల బదలాయింపు 

సర్వే సమస్యల పరిష్కారంలో జాప్యంతో ప్రజల నుంచి ఫిర్యాదులు 

దీంతో సర్వేచేసి నివేదిక ఇచ్చే బాధ్యత ఇకపై గ్రామ సర్వేయర్లకు అప్పగింత 

హద్దులు, విస్తీర్ణాల తేడాలు సరిచేసుకునేందుకే ఎఫ్‌ లైన్‌ పిటిషన్లు  

రీ సర్వే నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

సర్వే సమయం 30 నుంచి 15 రోజులకు కుదింపు 

సాక్షి, అమరావతి: భూముల సర్వే సేవలను మండలస్థాయి నుంచి గ్రామస్థాయికి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణ­యం తీసుకుంది. ఇప్పటివరకు మండల సర్వేయర్ల చేతిలో ఉన్న ఎఫ్‌ లైన్‌ పిటిషన్ల (సరిహద్దు వివాదాలు, హద్దులు–విస్తీర్ణంలో తేడాలు వంటివాటిపై వచ్చే దరఖాస్తులు) బాధ్యతను గ్రామ సర్వేయర్లకు అప్పగించింది. రీ సర్వే నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కార్యక్రమం మరింత వేగం పుంజుకోవడానికి, సాధారణంగా సర్వే వ్యవహారాల్లో జరిగే జాప్యాన్ని నివారించడానికి ఎంతో దోహదపడుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.

గ్రామాల్లో తమ భూమికి సంబంధించి హద్దుల్లో ఏమైనా తేడాలు వచ్చినా, విస్తీర్ణంలో తప్పులు చోటుచేసుకున్నా, ఇతరత్రా తమ భూమి గురించి అనుమానాలు నివృత్తి చేసుకోవాలన్నా భూ యజమానులు సర్వేకోసం దరఖాస్తు చేసుకుంటారు. దీనిని రెవెన్యూ పరిభాషలో ఎఫ్‌ లైన్‌ పిటిషన్‌గా పిలుస్తారు. ఇప్పటివరకు ఈ సర్వే బాధ్యతను మండల సర్వేయర్లు నిర్వర్తించేవారు. మండలానికి ఒక్కరే సర్వేయర్‌ ఉండడం, పిటిషన్లు కుప్పలుతెప్పలుగా వస్తుండడంతో సర్వే తీవ్ర జాప్యమవుతుండేది. భూముల రీ సర్వే సందర్భంగా ఎఫ్‌ లైన్‌ పిటిషన్లలో జాప్యాన్ని గుర్తించారు.  

ఇకపై పిటిషన్లు నేరుగా గ్రామ సర్వేయర్ల లాగిన్‌కు... 
ఈ నేపథ్యంలో ఆ బాధ్యతను మండల సర్వేయర్ల నుంచి గ్రామ సర్వేయర్లకు బదలాయించారు. గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల వెబ్‌సైట్‌ ద్వారా వచ్చే ఎఫ్‌ లైన్‌ దరఖాస్తులు ఇకపై నేరుగా గ్రామ సర్వేయర్‌ లాగిన్‌కు చేరతాయి. సర్వేకు నోటీసులు జారీచేయడం, సర్వే నిర్వహించడం, ఆ వివరాలతో నివేదిక తయారు చేసి డిప్యూటీ తహసీల్దార్‌కు పంపడం వంటి పనులన్నీ ఇకపై గ్రామ సర్వేయర్లే చేస్తారు.

డిప్యూటీ తహసీల్దార్‌ ఆ నివేదికను పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ తహసీల్దార్‌ డిజిటల్‌ లాగిన్‌ నుంచే సర్వే ఎండార్స్‌మెంట్‌ జనరేట్‌ అవుతుంది. గ్రామ సర్వేయర్లు నిర్వహించే సర్వేపై మండల సర్వేయర్లు మొదటి అప్పిలేట్‌ అధికారులుగా వ్యవహరిస్తారు. ఎఫ్‌ లైన్‌ పిటిషన్‌తో నిర్వహించే సర్వే సమయాన్ని కూడా 30 రోజుల నుంచి 15 రోజులకు తగ్గించారు.

ప్రజల చెంతకే.. 
భూముల సర్వే సేవలు ప్రజలకు చేరువకావడం ఇదే ప్రథ­మం. ఇప్పటివరకు మండల కేంద్రాల్లోని తహసీల్దా­ర్‌ కార్యాలయాల్లో ఉండే మండల సర్వేయర్ల వద్దకు భూ­యజమానులు వెళ్లాల్సి ఉండేది. ఇకనుంచి తమ గ్రామంలోని సచివాలయంలో పనిచేసే సర్వేయర్లే ఈ పని చేయనున్నారు. దీనిద్వారా సర్వేలో జాప్యం తగ్గడంతోపాటు భూయజమానులు తహసీల్దార్‌ కార్యాల­య­ం చుట్టూ తిరిగే పని తప్పుతుంది.

భూముల రీ సర్వే సందర్భంగా వచ్చే ఎఫ్‌ లైన్‌ పిటిషన్లపైనా ప్రత్యేకదృష్టి పెట్టనున్నారు. ఈ పిటిషన్లను ఇష్టానుసారం తిరస్కరించ­కుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తిరస్కరించిన దరఖాస్తుల్ని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ సర్వే అధి­కారుల స్థాయిలో పూర్తిగా పరిశీలించాలని భూ పరిపా­లన ప్రధాన కమిషనర్‌ సాయిప్రసాద్‌ ఆదేశాలిచ్చారు. 

మరిన్ని వార్తలు