ఇల వైకుంఠపురంలో..! ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు

16 Dec, 2021 13:47 IST|Sakshi

పుట్టిన పల్లెటూరిపై మమకారం 

భారీగా నగదు వెచ్చించి ఇళ్ల నిర్మాణం 

అందమైన ఆధునిక భవంతులు 

మమతలు పంచే ఊరు.. ఏమిటి దానికి పేరు.. పల్లెటూరేగా ఇంకేవూరు.. ప్రేమలు పుట్టిన ఊరు.. అనురాగానికి పేరు.. కాదనేవాళ్లే లేరు..‘శతమానం భవతి’ సినిమాలోని ఈ పాట.. ఉన్న ఊరిపై మమకారాన్ని.. అయినవాళ్ల అనురాగాన్ని తట్టి లేపుతుంది. అలాంటి సొంతూరులో మమతల కోవెల మాదిరిగా అభిరుచులకు అనుగుణంగా ఓ ఇల్లు కట్టుకుని అందులో జీవిస్తుంటే అంతకంటే ఆనందం ఏముంటుంది. అందుకే కొందరు తాము పుట్టి పెరిగిన పల్లెటూర్లలోనే అధునాతన ఇళ్లను కట్టుకుంటున్నారు. ఆధునిక వసతులూ సమకూర్చుకుంటున్నారు. ఆర్థిక స్తోమతను బట్టి తమ ఆకాంక్షలను నెరవేర్చుకుంటున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఇంద్రభవనాల్లాంటి ఇళ్లు   నిర్మించకుంటున్నారు. ఈ తరహా ట్రెండ్‌ మన గోదారి పల్లెల్లో ఎక్కువగానే కనిపిస్తోంది. 

బిక్కవోలు: బలభద్రపురంలోని కొవ్వూరి సతీష్‌రెడ్డి నివాసం చూస్తే ఇది ఇంద్రభవనమే అనిపిస్తుంది. సమీపాన ఏ పట్టణ ప్రాంతంలోనో కాకుండా  పుట్టి పెరిగిన ఊర్లో కళ్లు చెదిరేలా ఓ చక్కటి భవనాన్ని నిర్మించుకున్నారు. ఏడాదిన్నర కిత్రం భారీగా వెచ్చించి నిర్మించిన ఈ భవనం చూసి అబ్బురపడాల్సిందే. చుట్టుపక్కల చక్కటి పచ్చదనం ఉండేలా జాగ్రత్తగా ఈ భవనాన్ని నిర్మించారు. ఈ ఇంటికి ఎదురుగా పంచాయతీ చెరువు ఉండడంతో మరింత అందంగా కనిపిస్తోంది.

ఆయన నిర్మించిన భవనాన్ని చూడటానికి చుట్టు్టపక్కల గ్రామాల నుంచి స్నేహితులు, బంధువులు తెలిసిన వారు తరచూ వస్తుంటారు. దీంతో ఆ ఇల్లు సందడిగా ఉంటోంది. విలాసవంతంగా కనిపించే ఈ ఇల్లు వల్ల తమ ఊరికే ఓ ప్రత్యేకత వచ్చిందంటారు ఆ గ్రామస్తులు. ‘ఎంత సంపాదించాను కాదు ఎంత మంది అభిమానాన్ని పొందాం’అనే ఉద్దేశంతోనే ఈ భవనాన్ని నిర్మించినట్టు తెలుస్తోంది. 

అమ్మనాన్నకు ప్రేమతో... 
తాళ్లరేవు: పల్లెలో పుట్టి నాలుగు డబ్బులు సంపాదించి ఎక్కువ మంది నగరాల్లోనే స్థిరపడిపోతున్నారు. పల్లెతో అనుబంధం తెంచుకుని బిడ్డతోనే అయిష్టంగా తల్లిదండ్రులూ ఆ నగరవాసానికే అలవాటుపడిపోతున్నారు. ఉన్న ఊరిలో పలకరింపులకు.. అయినవారి అనుబంధాలకు దీనివల్ల పండుటాకులు దూరమవుతున్నారు. తాళ్లరేవు మండలం పిల్లంకకు చెందిన కనుమూరి శ్రీనివాసరాజు ఈ కోణం నుంచే ఆలోచించారు. తాను హైదరాబాద్‌లో బాగా స్థిరపడినా సొంతూరులో ఉంటామన్న తల్లిదండ్రుల ఆశలను ఘనంగా సాకారం చేశారు. ఇంద్రభవనాన్ని తలపించేలా మూడంతస్తుల ఇంటిని నిర్మించి అమ్మానాన్నలకు కానుకగా ఇచ్చారు. పెద్ద నగరాల్లో సంపన్న కాలనీల్లో ఇలాంటి ఇల్లు కనిపిస్తే గొప్ప విషయం కాదు. కుగ్రామంలోనే రూ.కోట్లు వెచ్చించి అమ్మానాన్నలపై అపారమైన ప్రేమను చాటుకున్నారు. దీని నిర్మాణానికి అధునాతన విదేశీ సామగ్రి వినియోగించడం విశేషం. శ్రీనివాసరాజు చిన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్‌లో అవకాశాలను అందిపుచ్చుకుని రాణించారు.

 

ఇదో మమతల కోవెల... 
అమలాపురం టౌన్‌: పిల్లల చదువుల పేరుతో పుట్టి పెరిగిన ఊళ్లను వదిలేసి పట్టణాల్లో కొందరు కాపురాలు ఉంటున్నారు. ఊళ్లో వ్యవసాయాలు చేస్తూ... నివాసాలు పట్టణాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. అలాంటిది కోనసీమలో కొందరు  కన్న ఊళ్లోనే.. ఉన్న చోటే మనకు ప్రకృతి అందించిన వరి చేలు.. కొబ్బరి తోటల మధ్య ఇల్లు నిర్మించేందుకు ఆసక్తి చూపుతున్నారు.  కాట్రేనికోన మండలం చెయ్యేరుకు చెందిన త్సవటపల్లి శ్రీనివాసరావు పట్నం వైపు చూడకుండా ఉన్న ఊళ్లోనే సొంత కొబ్బరి తోటల నడుమ ఓ చూడముచ్చటైన ఇల్లు కట్టుకున్నారు. అధునాతన సౌకర్యాలు సమకూర్చుకున్నారు. ఇది మమతల కోవెల అంటారాయన. నగరాలు, పట్టణాలకు వెళ్లి అధునాతనంగా ఇల్లు నిర్మించుకునే స్తోమత ఉన్నా కన్న ఊరిపై ఆయనకున్న మమకారం అలాంటిది. తన అభిరు చులకు అనుగుణంగా అందమైన నివాసాన్ని ఏర్పరచుకున్నారు.  

మరిన్ని వార్తలు