కరోనా కాలం: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై! 

15 May, 2021 08:02 IST|Sakshi
పలమనేరు మండలం మొరం పంచాయతీలో పొలం వద్ద ఉంటున్న ఓ కుటుంబం- పొలం వద్ద పశువుల షెడ్డును ఇంటిగా మార్చుకున్న కుటుంబం 

కోవిడ్‌ భయంతో పొలంబాట పట్టిన పల్లెలు

పగటిపూట చెట్లకింద, రాత్రి పూట షెడ్లలో సేదతీరుతున్న వైనం

పలమనేరు నియోజకవర్గంలో ఇదీ పరిస్థితి 

పలమనేరు: కోవిడ్‌ దెబ్బకు నియోజకవర్గంలోని కొన్ని గ్రామాలు ఖాళీ అయ్యాయి. పలువురు రైతులు ఇళ్లను వదలి పొలంబాట పడుతున్నారు. ఇన్నాళ్లూ పట్టణాలకే పరిమితమైన వైరస్‌ ఇప్పుడు పల్లెల్లో విజృంభిస్తోంది. శుక్రవారం నియోజకవర్గ వ్యాప్తంగా 260 కోవిడ్‌ కేసులు నమోదయ్యాయి. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఊర్లు వదలి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నారు.  

వ్యవసాయమే జీవనాధారం 
నియోజకవర్గంలో 90 పంచాయతీలున్నాయి. సుమారు 70 శాతం మందికి వ్యవసాయమే జీవనాధారం. రైతుల్లో చాలామందికి పొలాల వద్ద మోటారు షెడ్లు, పశువుల షెడ్లు, గుడిసెలు, కొందరికి పక్కా ఇళ్లు కూడా ఉన్నాయి. నిత్యం గ్రామాల్లోకి రావడం, జనంతో మాట్లాడడంతో కోవిడ్‌ వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. దీనికితోడు గ్రామాల్లోనూ ఎక్కువగా మరణాలు సంభవిస్తుండడంతో ఒకింత భయాందోళనకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో నెలకు సరిపడా నిత్యావసరాలు తీసుకొని కుటుంబ సమేతంగా పొలాల వద్ద తలదాచుకుంటున్నారు.

రెండు రకాలుగా లాభం 
ఇంటిల్లిపాది పొలం వద్ద  ఉండడంతో పొలం పనులు చక్కగా సాగుతున్నాయి. పగటిపూట వ్యవసాయపనులు, పశువులను సంరక్షిచండం చేస్తున్నారు. పాతకాలం నాటి పద్ధతులతో అరటి ఆకుల్లో రాగి ముద్ద, చారు వేసుకుని భోజనాలు చేస్తున్నారు. రాత్రి వేళల్లో అక్కడున్న సౌకర్యాలతోనే సర్దుకుపోతున్నారు. కొందరు పాకల్లో నిద్రిస్తుండగా.. మరికొందరు మోటారు షెడ్లలో సేదతీరుతున్నారు. రెండు,మూడు వారాలుగా గ్రామాల మొఖం చూడడం లేదు.

ఖాళీగా కనిపిస్తున్న పల్లెలు 
రైతులు వారి పొలాల వద్దనే తాత్కాలికంగా కాపురాలు ఉండడంతో పల్లెలు బోసిపోయి కనిపిస్తున్నాయి. గ్రామంలో ఎవరిని అడిగినా వారు పొలం వద్దే ఉంటున్నారనే సమాధానం వస్తోంది. పొలాల వద్ద సైతం సామాజిక దూరాన్ని పాటించేలా ఒకరిపొలం నుంచి మరొకరి పొలం వద్దకు వెళ్లడం లేదు. ఏదేమైనా కోవిడ్‌ పల్లె జనానికి కొత్త పాఠాలు నేర్పుతూ పాతతరానికి తీసుకెళ్లిందని స్థానికులు చెబుతున్నారు.

చదవండి: ‘వేవ్‌’లో కొట్టుకుపోతున్న ఉపాధి
పేదల ఆరోగ్యం కోసం ఖర్చుకు వెనుకాడం 

మరిన్ని వార్తలు