గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శం

20 Oct, 2020 04:39 IST|Sakshi

సంక్షేమం, అభివృద్ధిలో ప్రజా భాగస్వామ్యం 

అవినీతి నిర్మూలన, మెరుగైన ప్రయోజనం 

యువతకు ఉపాధి, సేవాభావం పెంపొందింపు  

ముఖ్యమంత్రి సలహాదారు అజేయ కల్లం  

సాక్షి, అమరావతి బ్యూరో:  గ్రామ సచివాలయ వ్యవస్థ దేశానికే ఆదర్శనీయంగా నిలిచిందని ఏపీ సీఎం సలహాదారు, మాజీ సీఎస్‌ అజేయ కల్లం అన్నారు.  ఏఎన్‌యూలో ‘గ్రామీణ భారతదేశ సుస్థిర అభివృద్ధి పయనం–అభినందనీయమైన గ్రామ సచివాలయ వ్యవస్థ’ అనే అంశంపై సోమవారం సదస్సు జరిగింది. సదస్సులో అజేయ కల్లం ఆన్‌లైన్‌ ద్వారా ప్రసంగిస్తూ ప్రజా భాగస్వామ్యం లేని సమాజాభివృద్ధికి అర్థమే లేదన్నారు. గ్రామాలకు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం బాధ్యతని గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గ్రామీణాభివృద్ధిలో బాధ్యతాయుతంగా చర్యలు చేపడుతున్నారన్నారు. అందులో భాగంగా గ్రామ సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారన్నారు.

సంక్షేమం, అభివృద్ధితో పాటు పాలన, అధికార వికేంద్రీకరణ చేపట్టడం ద్వారా అవినీతికి తావులేకుండా వాటి ఫలాలు క్షేత్రస్థాయిలో అన్ని వర్గాలకు అందుబాటులోకి తెచ్చారని తెలిపారు. లక్షలాది మంది వలంటీర్లు నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు.  ఈ వ్యవస్థ ద్వారా గ్రామీణ పేద వర్గాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు. గ్రామీణ సేవల విషయంలో గతంలో కేరళ ఆదర్శంగా ఉండేదని, నేడు గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఆ ప్రభుత్వం కూడా ఏపీని ఆదర్శంగా తీసుకుంటుందని వివరించారు. గ్రామ సచివాలయాల ద్వారా రానున్న రోజుల్లో మరిన్ని ఆదర్శవంతమైన ఫలితాలు వస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రా రెడ్డి, ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి.రాజశేఖర్, ఏపీ ప్రభుత్వ ఐసీడీ (ఇంటర్‌ కేడర్‌ డిప్యుటేషన్‌) ఐఏఎస్‌ అధికారి జీఎస్‌ నవీన్‌కుమార్‌ తదితరులు మాట్లాడారు.  

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు