గ్రామ సచివాలయాలే.. ఇక కోవిడ్‌ చికిత్స కేంద్రాలు

27 Oct, 2021 03:38 IST|Sakshi

11,789 మినీ కోవిడ్‌ కేర్‌ సెంటర్లు

గ్రామ సచివాలయ కార్యదర్శికి బాధ్యతలు 

ఏఎన్‌ఎం ఆధ్వర్యంలో ఆరోగ్య పర్యవేక్షణ.. కోవిడ్‌ తీవ్రత తక్కువగా ఉన్న వారికే..

సాక్షి, అమరావతి: ఇప్పటికే కరోనా వ్యాక్సినేషన్‌లో కీలక పాత్ర పోషించిన గ్రామ సచివాలయాలు ఇప్పుడు మరో  చరిత్ర సృష్టించనున్నాయి. వికేంద్రీకరణలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కోవిడ్‌ కేర్‌ సెంటర్లను గ్రామ సచివాలయాల పరిధిలోనే ఏర్పాటు చేయబోతున్నారు. కోవిడ్‌ తీవ్రత తక్కువగా ఉండి, సాధారణ మందులతోనే నయమయ్యే పరిస్థితులున్నప్పుడు.. వారికి గ్రామ సచివాలయాల కోవిడ్‌ కేర్‌ సెంటర్లోనే చికిత్స అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. కోవిడ్‌ సోకితే చిన్న చిన్న కుటుంబాలు, చిన్న ఇళ్లలో ఐసొలేషన్‌లో ఉండటం సాధ్యం కాదు. అందుకే గ్రామ సచివాలయాల్లోనే 5 పడకలతో కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. గ్రామీణులు ఇబ్బందులు  పడకుండా ఉండేందుకు,  మూడో వేవ్‌ అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఆరోగ్య పరిరక్షణ ఏఎన్‌ఎంలకు..
గ్రామ సచివాలయాల్లో ఏర్పాటు చేసే పడకల్లో చేరే కోవిడ్‌ బాధితుల ఆరోగ్య పర్యవేక్షణ ఏఎన్‌ఎంలకు అప్పగిస్తారు. నిర్వహణ బాధ్యతలు మాత్రం వార్డు సెక్రటరీ చూసుకుంటారు. భోజనం, మందులు సచివాలయ సిబ్బందే అందజేస్తారు. ఒకవేళ ఎవరికైనా కోవిడ్‌ తీవ్రత ఎక్కువైతే పంచాయతీ సెక్రటరీ లేదా తహసీల్దార్‌కు సమాచారం ఇస్తే.. అధికారులే దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తారు. గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసే కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కు అవసరమైన వైద్య ఉపకరణాలను కుటుంబ సంక్షేమశాఖ అందజేస్తుంది. 

11,789 గ్రామ సచివాలయాల్లో..
రాష్ట్రవ్యాప్తంగా 11,789 గ్రామ సచివాలయాల్లో  పడకలను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్కో కోవిడ్‌ కేంద్రంలో 4 నుంచి 5 పడకలు ఏర్పాటు చేస్తారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1,186 మైనర్‌ కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ మూడో వేవ్‌ వస్తే ముందస్తు అంచనాలను బట్టి ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు