వేకువనే వచ్చారు.. పింఛను డబ్బిచ్చారు

2 Dec, 2021 04:25 IST|Sakshi
శ్రీకాకుళంలోని 16వ వార్డులో దివ్యాంగురాలికి పింఛను అందిస్తున్న వలంటీర్‌ గీతాంజలి

తొలి రోజు 56.22 లక్షల మందికి రూ.1,312 కోట్ల నగదు పంపిణీ 

92.92 శాతం మంది లబ్ధిదారులకు పంపిణీ పూర్తి 

మరో నాలుగు రోజులపాటు కొనసాగనున్న పంపిణీ  

సాక్షి, అమరావతి: వార్డు, గ్రామ వలంటీర్లు బుధవారం తెల్లారకముందే సామాజిక పింఛను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. పింఛను సొమ్ములు పంపిణీ చేశారు. డిసెంబర్‌ 1వ తేదీనే రాష్ట్రంలో 56,22,435 మంది లబ్ధిదారులకు పింఛను డబ్బులు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 60,50,650 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసే నిమిత్తం రూ.1,411.42 కోట్లను పంపిణీకి గాను ప్రభుత్వం నవంబర్‌ 3వ తేదీనే గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శుల ఖాతాలకు జమ చేసింది. బుధవారం తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి నగదు పంపిణీకి శ్రీకారం చుట్టారు.

రాత్రి వరకు 92.92 శాతం లబ్ధిదారులకు రూ.1,312.21 కోట్లను అందజేసినట్టు అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 95.05 శాతం మందికి పంపిణీ పూర్తవగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 88.82 శాతం మందికి పంపిణీ పూర్తయింది. మొత్తంగా తొలి రోజున 92.92 శాతం మంది లబ్ధిదారులకు పింఛను నగదు అందింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ  (సెర్ప్‌) సీఈవో ఇంతియాజ్‌ కృష్ణా జిల్లా విజయవాడ రూరల్‌ మండలంలో గొల్లపూడిలో పర్యటించి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. తొలి రోజు పింఛను డబ్బులు అందుకోలేకపోయిన వారికి మరో నాలుగు రోజులపాటు వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పంపిణీ చేస్తారని సెర్ప్‌ అధికారులు చెప్పారు.

మరిన్ని వార్తలు