నిజాయతీగా పని చేస్తే అసత్యవార్తలు రాస్తారా!

16 Dec, 2022 05:11 IST|Sakshi
పాలసముద్రం గ్రామ సచివాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న వలంటీర్లు

‘ఈనాడు’పై వలంటీర్ల ఆగ్రహం.. వివిధ ప్రాంతాల్లో నిరసన

శంఖవరంలో రామోజీరావు దిష్టిబొమ్మ దహనం

కార్వేటినగరం/పాలసముద్రం/శంఖవరం/వాల్మీకిపురం: ‘నిజాయతీగా ప్రజలకు సేవ చేస్తున్న మాపై అసత్యవార్తలు రాస్తే అంతుచూస్తాం. మీ రాతలు మారకపోతే, మీ తలరాతను మార్చేందుకు 4లక్షల మంది వలంటీర్లం సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే ఈనాడు అధినేత రామోజీరావు ఇల్లు ముట్టడిస్తాం..’ అని గ్రామ, వార్డు వలంటీర్లు హెచ్చరించారు. వలంటీర్లపై ‘ఈనాడు’లో వచ్చిన అసత్య కథనాన్ని ఖండిస్తూ గురువారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

చిత్తూరు జిల్లా, జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం, పాలసముద్రం, అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం, కాకినాడ జిల్లా శంఖవరంలో వలంటీర్లు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. శంఖవరంలో రామోజీరావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయా ప్రాంతాల్లో వలంటీర్లు మాట్లాడుతూ ‘రామోజీరావు గుర్తుంచుకో... మీ చంద్రబాబు పెట్టుకున్న జన్మభూమి కమిటీ సభ్యులం కాదు మేము. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న గౌరవ వేతనాన్ని తీసుకుని నిస్వార్థంగా ప్రజలకు సేవలందిస్తున్నాం.

మేము జన్మభూమి కమిటీల మాదిరి అక్రమాలకు పాల్పడటం లేదు. వలంటీర్ల వ్యవస్థ అంటే మోసం చేసే చిట్‌ ఫండ్‌ సంస్థ కాదు. కరోనా కష్టకాలంలో సైతం ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల కోసం పనిచేసిన గొప్ప వ్యవస్థ అని గుర్తుంచుకోండి. ఈనాడు, టీవీలో ప్రచారం చేసినట్లుగా మేము వేగులం కాదు. ప్రజాసేవకులం.

వలంటీర్‌ వ్యవస్థకు ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. దానిని ఓర్వలేక రాజకీయ కోణంలో దుష్ప్రచారం చేయడం తగదు. వలంటీర్ల వ్యవస్థపై అపోహలు సృష్టించేందుకు ఎన్ని తప్పుడు కథనాలు ప్రచురించినా, ప్రజల నుంచి మమ్మల్ని వేరుచేయలేరు’ అని స్పష్టంచేశారు. 

శభాష్‌... వలంటీర్‌
చీరాల టౌన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటుచేసిన గ్రామ వలంటీర్లు సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలంలోని సాల్మన్‌సెంటర్‌ గ్రామ పంచాయతీకి చెందిన గ్రామ వలంటీర్‌ పేర్ల వెంకట ఫణిరాజ శమన్‌ తమ గ్రామస్తుల కోసం గురువారం ఎల్వీ ప్రసాద్‌ నేత్ర వైద్యశాల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటుచేశారు.

గ్రామ సచివాలయం సమీపంలో ఏర్పాటుచేసిన ఈ వైద్య శిబిరంలో 142 మందికి వైద్య నిపుణులు వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. వివిధ రకాల కంటి సమస్యలతో బాధపడుతున్న వారిని శస్త్ర చికిత్సల కోసం ఎంపిక చేశారు. ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసిన వలంటీర్‌ను శభాష్‌.. అని గ్రామస్తులు అభినందించారు.   

మరిన్ని వార్తలు