'గంజాయి'పై కదిలిన గ్రామ చైతన్యం

29 Oct, 2021 03:44 IST|Sakshi
చౌడుపల్లిలో గంజాయి తోటలను ధ్వంసం చేస్తున్న గ్రామస్తులు

విశాఖ జిల్లా చౌడుపల్లిలో గంజాయి తోటలను ధ్వంసం చేసిన గ్రామ యువకులు

కొయ్యూరు: గంజాయిని రాష్ట్రంలో సమూలంగా నాశనం చేయాలన్న ప్రభుత్వం పిలుపు మేరకు ఆ గ్రామంలోని యువకులు ముందుకు కదిలారు. తమ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో సాగవుతున్న గంజాయి తోటలను ధ్వంసం చేయటంతోపాటు.. ఇకపై గ్రామస్తులు ఎవరూ గంజాయి పండించకూడదని తెలియజెప్పారు. విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీ చౌడుపల్లి గ్రామాన్ని ఆనుకొని అటవీ ప్రాంతం ఉంది.

కొందరు గ్రామస్తులు అక్కడ గంజాయిని పండిస్తున్నారు. గ్రామ యువకులు పలువురు గురువారం అక్కడికి చేరుకుని, సుమారు ఎకరం విస్తీర్ణంలో సాగవుతున్న గంజాయి తోటలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక నుంచి గ్రామస్తులు ఎవరూ గంజాయిని పండించరని, ఎవరైనా తోటలను వేస్తే పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు. దీనిపై కొయ్యూరు సీఐ స్వామినాయుడు మాట్లాడుతూ.. గంజాయి ఎక్కువగా సాగవుతున్న మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రజలు ఈ విధంగా చైతన్యవంతులై గంజాయి తోటలను స్వయంగా వారే ధ్వంసం చేయటం శుభపరిణామమన్నారు. 

మరిన్ని వార్తలు