Kurnool: మొదలైన వజ్రాల అన్వేషణ

16 May, 2022 08:14 IST|Sakshi
తుగ్గలి మండలం జొన్నగిరి వద్ద పొలాల్లో వజ్రాల కోసం వెతుకున్న దృశ్యం 

తొలకరి చినుకులు పడడంతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న జనం 

సుదూర ప్రాంతాల నుంచి సైతం తరలివస్తున్న వైనం 

వజ్రాల వేటలో పొలాలు పాడైపోతున్నాయని రైతన్నల ఆందోళన 

ఎక్కడైనా తొలకరి వర్షాలు కురవగానే పొలాల్లో పంట సాగు పనులు ప్రారంభమవుతాయి. కానీ పత్తికొండ ప్రాంతంలో మాత్రం వజ్రాలన్వేషణ మొదలవుతుంది.  స్థానికులే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి సైతం జనం ఇక్కడికి తరలివచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.  రెండురోజుల క్రితం కురిసిన చినుకులకు పుడమి తడవడంతో ఎప్పటిలాగే ఈసారి కూడా ఆశల వేటను మొదలు పెట్టారు. 

సాక్షి, కర్నూలు(తుగ్గలి): కరువుకు నిలయమైన పత్తికొండ నియోజకవర్గంలో ఏటా తొలకరిలో వజ్రాల పంట పండుతోంది.  దాదాపు 40 ఏళ్లకు పైగా ఈ ప్రాంతంలో వాటి అన్వేషణ కొనసాగుతోంది. మొదట్లో వ్యవసాయ పనులకు వెళ్లిన వారికి వజ్రాలు దొరికాయి. క్రమంగా ఇది వేటగా మారి పోయింది. అదృష్టం వరిస్తే క్షణాల్లో లక్షాధికారులు అవుతున్నారు. స్థానికులే కాకుండా వైఎస్సార్, నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, తెలంగాణాలోని మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి పలువురు ఇక్కడికి చేరుకొని వజ్రాన్వేషణ కొనసాగిస్తుంటారు.

తొలకరి వర్షాలు కురవగానే తుగ్గలి మండలంలోని పగిడిరాయి, తుగ్గలి, రామాపురం, చిన్నజొన్నగిరి, జి.ఎర్రగుడి, ఉప్పర్లపల్లి, తుగ్గలి, గిరిగెట్ల, మద్దికెర మండలంలోని పెరవలి,బసినేపల్లి, మద్దికెర, అనంతపురం జిల్లాలోని బేతాపల్లి, ఊటకల్లు, బసినేపల్లి, వజ్రకరూర్‌ తదితర ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ మొదలవుతుంది. వర్షాలు బాగా కురిస్తే తెల్లారేసరికి జనం పొలాల్లో వాలిపోతుంటారు. ఏటా విలువైన వజ్రాలు లభ్య మవుతుండడంతో జనం పిల్లాపాపలతో వచ్చి వెతుకుతుంటారు. దొరికిన వజ్రాలను కొందరు రహస్యంగా, మరికొందరు టెండరు పద్ధతి ద్వారా అమ్ముకుంటుంటారు. వజ్రం రంగు, జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కకట్టి నగదు, బంగారం ఇచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తారు. 

గతేడాది విలువైన వజ్రం లభ్యం.. 
గతేడాది చిన్న జొన్నగిరికి చెందిన ఓ రైతుకు విలువైన వజ్రం లభ్యమైంది. రూ.1.20 కోట్ల విలువైన డైమండ్‌ దొరికింది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక ధర పలికిన వజ్రం. వేలు, లక్షల విలువైన వజ్రాలు సైతం లభ్యమవుతుంటాయి. ప్రస్తుతం తొలకరి సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యాపారులు కూడా తమ అనుచరులను అప్రమత్తం చేసే పనిలో పడ్డారు. ఎవరికైనా వజ్రం లభ్యమైనట్లు తెలియగానే తమ ఆసాముల వద్దకు తీసుకెళ్లడంలో అనుచరులు కీలక పాత్ర పోషిస్తారు. 2000 సంవత్సరంలో రాంపల్లిలో పొలం పనులకు వెళ్లిన వారికి విలువైన వజ్రం లభ్యమైంది. అయితే ఇద్దరి మధ్య తగాదా రావడంతో ఆ వజ్రాన్ని అప్పట్లో రెవెన్యూ అధికారులు ట్రెజరీకి పంపారు. ఈ ప్రాంతంలో ఏటా వజ్రాలు దొరుకుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కూడా నిక్షేపాల కోసం అన్వేషించింది. చివరకు బంగారం నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది. 2013లో బంగారం నిక్షేపాల వెలికితీతకు జియోమైసూర్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చింది. 

చదవండి: (Palle Vs JC: పల్లె ఉక్కిరిబిక్కిరి.. తెరవెనుక అధిష్టానం..?)

వజ్రాన్వేషణతో రైతులకు అవస్థలు  
వజ్రాన్వేషణకు వివిధ ప్రాంతాల నుంచి జనం వస్తుండడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. కురిసిన వర్షాలకు విత్తనం వేసుకునేందుకు పొలాలు దుక్కిదున్ని సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో జనం తొక్కుతుండడంతో పొలాలు గట్టి పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. పైగా పొలాల్లో పనికోసం వెళ్లిన వారిపై కొందరు దౌర్జన్యానికి దిగుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వజ్రాన్వేషణకు వచ్చేవారిని నియంత్రించేందుకు గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు. పొలాల్లో జనం తిరిగినా, సమీపంలో వాహనాలు నిలిపినా జరిమానాలు విధించాలని తీర్మానించుకున్నారు. వజ్రాన్వేషణకు ఎవరూ రావద్దని వస్తే జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నారు.

8 ఏళ్ల నుంచి వస్తున్నాను
వజ్రాలు వెతికేందుకు ప్రతి సంవత్సరం తొలకరిలో నేను ఇక్కడికి వస్తున్నాను. 8 ఏళ్ల నుంచి పొలాల్లో వెతుకుతున్నాను. ఈసారి మేము ఎనిమిది మంది వచ్చాం. మూడు, నాలుగు రోజులుండి తిరిగి ఊరెళ్లిపోతాం.
– నాగరాజు, కారుడ్రైవరు, ఒంగోలు 

మరిన్ని వార్తలు