చెత్త నుంచి సంపద సృష్టించిన గ్రామాలు

6 Feb, 2022 03:37 IST|Sakshi
గుంటూరు జిల్లా చేబ్రోలులో వర్మీ కంపోస్ట్‌ తయారు చేస్తున్న మహిళలు

ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తతో వర్మీ తయారీ.. అమ్మకం.. 3 నెలల్లో 198 పంచాయతీల్లో రూ.14 లక్షల ఆదాయం

త్వరలో మరో 656 గ్రామాల్లో వర్మీ తయారీపై అధికారుల దృష్టి  

అన్ని గ్రామాల్లో ఈ ప్రక్రియ మొదలైతే ఏటా రూ.300 కోట్ల ఆదాయం

సాక్షి, అమరావతి: చెత్తే కదాని తేలిగ్గా తీసి పడేయకండి.. ఎందుకంటే ఇప్పుడది సంపదను సృష్టించే వనరుగా మారింది. దాని నుంచి వర్మీ కంపోస్ట్‌ను తయారు చేస్తూ ఆయా గ్రామ పంచాయతీలు ఆదాయార్జనకు బాటలు వేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ పంచాయతీ గడిచిన మూడు నెలల్లో ఇలా రూ.1,62,800 ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంటింటి నుంచి సేకరించిన చెత్తను వర్మీ కంపోస్ట్‌గా మారుస్తూ.. దానిని రైతులకు అమ్ముతూ ఆ డబ్బును కూడబెట్టాయి. ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 198 గ్రామ పంచాయతీలు ఇలా చెత్త నుంచి వర్మీ కంపోస్ట్, అమ్మకం ద్వారా రూ.14,06,994ను సంపాదించాయి. క్లీన్‌ ఆంధ్రప్రదేశే లక్ష్యంగా గతేడాది అక్టోబర్‌ రెండో తేదీన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించాక.. పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ చెత్త సేకరణ ప్రక్రియ మొదలైంది.

గ్రామాల్లో చెత్త సేకరణకు అవసరమైన ఆటో రిక్షాలు, ఇతర సామగ్రిని ప్రభుత్వమే సమకూర్చడంతో పాటు చెత్త సేకరణలో పనిచేసే క్లాప్‌ మిత్రలకు గౌరవ వేతనాలనూ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో 98.73 లక్షల ఇళ్లు ఉన్నట్టు అంచనాకాగా, వాటిలో 95.63 లక్షల ఇళ్ల నుంచి ఇప్పటికే రోజు వారీ చెత్తను గ్రామ పంచాయతీ సిబ్బంది సేకరిస్తున్నారు. ఇక ఆ చెత్త నుంచి వర్మీ తయారీపై పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. 198 గ్రామాల్లో ఇప్పటికే వర్మీ తయారీ అమ్మకాలు మొదలు కాగా.. రానున్న వారం రోజుల్లో మరో 656 గ్రామాల్లో వర్మీ తయారీ, అమ్మకాల ప్రక్రియను ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 
 
40 రోజుల్లో వర్మీ రెడీ 
చెత్తను వర్మీగా తయారు చేసేందుకు కనీసం 40 రోజులు పడుతుందని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను గ్రామాల్లో ప్రభుత్మం నిర్మించిన సాలీడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ షెడ్లకు తరలిస్తారు. ఇప్పటికే ఉన్న షెడ్లకు తోడు ప్రభుత్వం కొత్తగా మరో 1,794 గ్రామాల్లో షెడ్ల నిర్మాణాన్ని చేపడుతోంది. ఈ షెడ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తొట్టెల్లో ఆ చెత్తను వేసి, దానిపై వాన పాములను ఉంచుతారు. ఆ తర్వాత వాటిపై గోనె పట్టలను ఉంచి ఎప్పటికప్పుడు వాటిని తడిచేస్తూ నిర్ణీత ఉష్ణోగత్ర కొనసాగేలా జాగ్రత్తలు చేపడతారు. 40 రోజుల తర్వాత వాన పాములు ఉంచిన ఆ చెత్త మిశ్రమం వర్మీగా మారుతుందని అధకారులు చెబుతున్నారు. 

కిలో వర్మీ రూ.10 
చెత్త నుంచి తయారు చేసిన వర్మీని కిలో రూ.10 చొప్పన అమ్మాలని పంచాయతీరాజ్‌ శాఖ ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సూచనలిచ్చింది. ప్రస్తుతం చాలా తక్కువ గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ మొదలవడంతో.. తయారైన కొద్దిపాటి వర్మీ అమ్మకానికి పెద్దగా ఇబ్బందుల్లేవని అధికారులంటున్నారు. స్థానిక రైతులతో పాటు ఇళ్లల్లో మొక్కలు పెంచుకునే వారు కూడా వర్మీని కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వర్మీ తయారీ ప్రక్రియ ఊపందుకుని, పెద్ద మొత్తంలో అందుబాటులోకొస్తే.. అప్పుడు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్మేందుకు ఇప్పటికే వ్యవసాయ శాఖ అనుమతి కోరుతూ పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు లేఖ రాశారు. 

అన్ని గ్రామాల్లో మొదలైతే రూ.300 కోట్ల వరకూ ఆదాయం
పంచాయతీరాజ్‌ శాఖ ముందస్తుగా తయారు చేసుకున్న ప్రణాళిక ప్రకారం రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చెత్త నుంచి వర్మీ తయారీ ప్రక్రియ మొదలైతే గ్రామ పంచాయతీల ఆదాయం భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ తరహా వర్మీ తయారీ ద్వారానే గ్రామాలకు ఏటా రూ.300 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు