వేరియంట్‌లు ఏవైనా జాగ్రత్తలు అవే..

27 Jun, 2021 04:14 IST|Sakshi

వైరాలజిస్ట్‌ డాక్టర్‌ రోజారాణి 

సాక్షి, అమరావతి: కరోనా వైరస్‌కు సంబంధించిన వేరియంట్‌లు చాలా వస్తున్నాయి.. అంతరించి పోతున్నాయి.. కానీ వైరస్‌ నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు జాగ్రత్తలు మారవని కర్నూలు జనరల్‌ ఆస్పత్రి వైరాలజిస్ట్‌ డాక్టర్‌ రోజారాణి వెల్లడించారు. శనివారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. మాస్కు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవడం, భౌతిక దూరం పాటించడం.. ఈ జాగ్రత్తలే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు శాశ్వత పరిష్కార మార్గాలని చెప్పారు. మన రాష్ట్రంలో మొదటి వేవ్, రెండో వేవ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో వేరియంట్‌లు వచ్చాయని, కొన్ని అంతరించి పోయాయన్నారు. ప్రస్తుతం తెరమీదకొచ్చిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ వేగంగా వ్యాప్తి చెందే రకంగా తేలిందన్నారు.

మొదటి వేవ్‌లో శరీరంలోకి ప్రవేశించిన వైరస్‌ బాగా అభివృద్ధి చెందడానికి 14 రోజుల సమయం తీసుకునేదని, అదే సెకండ్‌ వేవ్‌కు వచ్చేసరికి మూడు, నాలుగు రోజులు పడుతోందన్నారు. ఇప్పటివరకు మాస్కులు అవసరం లేదని ప్రకటించిన దేశాలు ఇప్పుడు కొత్త వేరియంట్‌లతో మళ్లీ జాగ్రత్తలు తీసుకుంటున్నాయన్నారు. డెల్టా ప్లస్‌ వేరియంట్‌ అనగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, గడప దాటగానే విధిగా మాస్కు ధరించాలన్న ఆలోచన మంచి ఫలితాలనిస్తుందన్నారు. రద్దీగా ఉండే ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. వ్యాక్సిన్‌ రక్షణనిస్తుందని, అయితే వ్యాక్సిన్‌ వేయించుకున్న వారు కూడా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్‌ వేయలేదు కాబట్టి వారిపట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. వివిధ వేరియంట్‌లను గుర్తించడం, వాటి ప్రభావ శీలతను లెక్కించడానికి జినోమిక్‌ ల్యాబొరేటరీలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని డాక్టర్‌ రోజారాణి పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు