AP: మెగా ఐటీ హబ్‌గా విశాఖ!

31 Jul, 2021 10:04 IST|Sakshi

ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌

ప్రస్తుత అవసరాలకనుగుణంగా కోర్సులు, నైపుణ్య శిక్షణ

రెగ్యులర్, పార్ట్‌టైమ్‌ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్న పలు ఐటీ కంపెనీలు తమ యూనిట్లను విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో విశాఖను ఐటీ కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

దీనివల్ల ప్రధానంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులు, ప్రస్తుత సాంకేతిక అవసరాలతోపాటు విద్యార్థులకు అవసరమైన ఐటీ పరిజ్ఞానం, నైపుణ్యాలు అందుతాయి. అంతేకాకుండా వివిధ అంతర్జాతీయ, దేశీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఐటీ రంగంలో వస్తున్న కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు అందిస్తారు. ఈ వర్సిటీలో రెగ్యులర్, పార్ట్‌టైమ్‌ ఐటీ డిప్లొమా, మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులను ప్రవేశపెడతారు. మొత్తంగా రాష్ట్ర చిత్రపటంలో విశాఖ మెగా ఐటీ హబ్‌గా అవతరించనుంది. 

టీడీపీ పాలనలో అటకెక్కిన ఐటీ
విశాఖను ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తామని గత టీడీపీ ప్రభుత్వం 2014–20కి ఐటీ పాలసీని ప్రకటించింది. ఇందులో భాగంగా ఏకంగా 5 మిలియన్‌ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తామంది. అంతేకాకుండా ఒక మిలియన్‌ చ.అ విస్తీర్ణంలో ఐటీ సిగ్నేచర్‌ టవర్‌ను నెలకొల్పుతామని ఆర్భాటంగా ప్రకటించింది. మధురవాడలోని 21 ఎకరాల స్థలంలో ఈ సిగ్నేచర్‌ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు ఒక కన్సల్టెన్సీని కూడా నియమించింది. అయితే.. చిన్న చిన్న భవనాలను నిర్మించి ఐటీ కంపెనీలకు కేటాయిస్తామంటూ ఈ సిగ్నేచర్‌ టవర్‌ ప్రాజెక్టును మధ్యలోనే అటకెక్కించింది.

తీరా భవనాలు కూడా కార్యరూపం దాల్చలేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కువగా ఐటీ, ఐటీ ఆధారిత సంస్థల టర్నోవర్‌ సుమారు రూ. 2 వేల కోట్ల మేర విశాఖ జిల్లా నుంచే ఉంది. అయినప్పటికీ టీడీపీ ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించడంతోపాటు ఐటీ అభివృద్ధికి కూడా విశాఖనే కేంద్రంగా మార్చాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏకంగా ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు. 

వైఎస్సార్‌ హయాంలోనే విశాఖకు 14 కంపెనీలు
విశాఖలో ఐటీ అభివృద్ధికి గతంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి విశేషకృషి చేశారు. ఆయన హయాంలోనే విశాఖపట్నానికి టెక్‌ మహీంద్రా, విప్రో, మెరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ వంటి 14 కంపెనీలు వచ్చాయి. ఇక టీడీపీ హయాంలో చిన్న చిన్న కంపెనీలను తీసుకొచ్చి రాయితీల పేరుతో దోపిడీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖను ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసే ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ద్వారా ఐటీ కంపెనీలకు అవసరమైన మానవవనరులు అందుబాటులోకి వస్తాయి. మన విద్యార్థులకు కూడా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వెంటనే అందించవచ్చు.
 – శ్రీధర్‌రెడ్డి, మిలీనియం సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్, సీఈవో, ఎండీ

ప్రత్యేకంగా ఐటీ యూనివర్సిటీ ఎందుకంటే..
సాంకేతిక రంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సి ఉంటుంది. 
► ప్రస్తుతం విద్యార్థులు చదువు పూర్తి చేసుకున్నాక.. మళ్లీ ఆయా కంపెనీల అవసరాలకనుగుణంగా బయట ప్రైవేటుగా ఐటీ కోర్సులను నేర్చుకోవాల్సి వస్తోంది. ఇది వారికి ఆర్థికంగా భారంగా మారుతోంది. 
► అంతేకాకుండా కాలేజీ నుంచి వచ్చిన వెంటనే అనేక మందికి ఉద్యోగాలు రావడం లేదు. 
► ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడం, మారుతున్న అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను రూపొందించడం, విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొందేలా తర్ఫీదు ఇవ్వడమే లక్ష్యంగా ఐటీ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. 
► ఈ ప్రత్యేక యూనివర్సిటీ ద్వారా దేశ, విదేశాల్లో మన విద్యార్థులకు అపార అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. 
► అదేవిధంగా విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి కూడా విశాఖలో ఏర్పాటు చేయబోయే రీసెర్చ్‌ యూనివర్సిటీ ద్వారా సహకారం అందించనున్నారు.

మరిన్ని వార్తలు