తూర్పు తీరంలో 'యాస్‌' అలజడి

25 May, 2021 03:38 IST|Sakshi
తుపాన్‌ పయనించే మార్గం ఇలా..

అతి తీవ్ర తుపాన్‌గా మారి గంటకు 12 కి.మీ వేగంతో కదలికలు

రేపు మధ్యాహ్నం పారాదీప్‌ – సాగర్‌ ఐలాండ్స్‌ మధ్య తీరం దాటే అవకాశం

ఉత్తరాంధ్రకు 2 రోజులు వర్షం

చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు సూచన

పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు 

తుపాన్‌ పరిస్థితులపై సీఎంలతో చర్చించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా

సాక్షి, విశాఖపట్నం, సాక్షి, అమరావతి:  తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘యాస్‌’ తుపాన్‌ వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం ఇది పోర్టు బ్లెయిర్‌కు ఉత్తర వాయువ్య దిశగా 710 కి.మీ, పారాదీప్‌కు దక్షిణ ఆగ్నేయ దిశగా 450 కి.మీ, బాలాసోర్‌కి ఆగ్నేయ దిశగా 550 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు దక్షిణ ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల మధ్య కేంద్రీకృతమైంది. గత ఆరు గంటలుగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణిస్తోంది. ఇది మంగళవారం ఉదయం నాటికి తీవ్ర తుపాన్‌గా, 24 గంటల్లో అతి తీవ్ర తుపాన్‌గా బలపడనుందని విశాఖ తుపాన్‌ హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. బుధవారం తెల్లవారుజామున ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ మరింత బలపడి ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ తీరానికి సమీపంలో వాయువ్య బంగాళాఖాతానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం పారాదీప్, సాగర్‌ ఐలాండ్స్‌ మధ్య చాలా తీవ్రమైన తుపాన్‌గా మారి బుధవారం మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అతి తీవ్ర తుపాన్‌గా మారినప్పుడు గంటకు 135 నుంచి 160 కి.మీ. వేగంతో, తీరం దాటే సమయంలో గంటకు 155 నుంచి 165 కి.మీ, గరిష్టంగా 185 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. తుపాన్‌ ప్రభావంతో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు తీరం అలజడిగా ఉంటుందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్‌ కె.కన్నబాబు ఒక ప్రకటనలో సూచించారు. తుపాన్‌ ప్రభావం ఎక్కువగా ఒడిశా, పశ్చిమ బెంగాల్‌.. సిక్కిం రాష్ట్రాలపై, స్వల్పంగా జార్ఖండ్, బిహార్, అసోం, మేఘాలయ రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

– ఆంధ్రప్రదేశ్‌లో దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై మాత్రమే కొంత వరకు ఉంటుందని వెల్లడించారు.
– శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నేడు, రేపు మేఘావృత వాతావరణం ఉంటుందని, అక్కడక్కడా తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
– ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నేడు, రేపు ఉత్తర కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. తీరం దాటే సమయంలో ఉత్తరకోస్తా తీరంలో గంటకు 140–160, గరిష్టంగా 185 కి.మీ వేగంతో కోస్తా తీరం వెంట గాలులు వీస్తాయి. దక్షిణ కోస్తా తీరంలో గంటకు 80 నుంచి 90 కి.మీ, గరిష్టంగా 100 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. 
– తీరం వెంట బలమైన గాలుల ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. అలలు 2 నుంచి 4 మీటర్ల ఎత్తుకు ఎగసిపడతాయి. 
– మత్స్యకారులు ఈ నెల 27వతేదీ వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.
– విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో 2వ నంబర్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో మూడో నంబర్‌ హెచ్చరిక జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టులకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక జారీ చేశారు.
– వచ్చే రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
– తుపాన్‌ తీరం దాటిన తర్వాత రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని, వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
– గడిచిన 24 గంటల్లో జూపాడు బంగ్లాలో 4 సెంమీ, దర్శి, మర్రిపూడి, చీమకుర్తి, పగిడ్యాల, గుత్తి 3 సెంమీ, ముండ్లమూరు, యర్రగొండ్లపాలెం, వెలిగండ్ల, పొదిలి, ఆత్మకూరు, నందికొట్కూరు, ఓర్వకల్లు, ఊటుకూరులో 2 సెంమీ వర్షపాతం నమోదైంది.

సీఎంలతో అమిత్‌ షా వీడియో కాన్ఫరెన్స్‌
తుపాను పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిషా ముఖ్యమంత్రులతోపాటు అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కూడా దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ తుపాను కదలికలను పరిశీలిస్తే రాష్ట్రంపై ప్రభావం స్వల్పంగానే ఉండే అవకాశాలున్నప్పటికీ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని ముందుకు సాగుతామని చెప్పారు. మే 22న కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి నిర్వహించిన సమావేశానికి అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని తెలిపారు. 

మరిన్ని వార్తలు