ఉమెన్‌ ఫ్రెండ్లీ విశాఖ.. మహిళలు దర్జాగా జీవించడానికి అనువైన నగరం 

25 Jan, 2023 08:30 IST|Sakshi

దేశంలోని టాప్‌–10 నగరాల్లో 7వ స్థానం

టాప్‌ సిటీస్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా సర్వేలో వెల్లడి

సాక్షి, అమరావతి: మహిళలు దర్జాగా ఉద్యోగాలు చేసుకోవడంతో పాటు జీవించడానికి అత్యంత అనుకూలమైన టాప్‌–10 నగరాల్లో ఒకటిగా విశాఖపట్నం నిలిచింది. సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు రాణించడానికి దేశంలో అనుకూలమైన నగరాలపై జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ‘టాప్‌ సిటీస్‌ ఫర్‌ ఉమెన్‌ ఇన్‌ ఇండియా’ పేరుతో అవతార్‌ గ్రూప్‌ అనే సంస్థ దేశంలోని 111 నగరాల్లో ఈ అధ్యయనం నిర్వహించింది.

ఆయా నగరాల్లో నేరాల రికార్డు, లివింగ్‌ ఇండెక్స్, మహిళా, శిశు సంక్షేమ శాఖ వార్షిక నివేదికలు, ఇతర విభాగాల నుంచి సేకరించిన 200కు పైగా అంశాలను విశ్లేషించారు. 10 లక్షల జనాభా పైబడిన(కేటగిరి–1), 10 లక్షల లోపు జనాభా నగరాలు (కేటగిరి–2) అనే రెండు విభాగాలుగా అధ్యయనం చేశారు. కేటగిరి–1లో 49, కేటగిరి–2లో 62 నగరాలను అధ్యయనం చేశారు.

కాగా, కేటగిరి–1 నగరాల్లో చెన్నై మొదటి స్థానంలో ఉంది. పుణె, బెంగళూరు, హైదరాబాద్‌ నగరాలు వరుసగా తరువాతి స్థానాల్లో ఉన్నాయి. విశాఖకు ఏడో స్థానం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీ నగరం 14వ స్థానంలో ఉండటం గమనార్హం. విజయవాడ నగరం 19వ స్థానంలో ఉంది. మరోవైపు కేటగిరి–2లో తమిళనాడుకు చెందిన తిరుచిరాపల్లి, వెల్లూర్, ఈరోడ్, సేలం, తిరుప్పూర్‌ నగరాలు వరుసగా ఐదు స్థానాల్లో నిలిచాయి. ఈ విభాగంలో కాకినాడ నగరం 12వ స్థానంలో నిలిచింది.

ఇన్‌క్లూజన్‌ స్కోర్‌ ఆధారంగా 
సోషల్‌ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌ (మహిళల భద్రత, ప్రాతినిధ్యం, సాధికారత, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్, ఇండ్రస్టియల్‌ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌ (సంస్థలు, పరిశ్రమలు, మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు) ఈ రెండింటిని విశ్లేషించి నగరాల వారీగా సిటీ ఇన్‌క్లూజన్‌ స్కోర్‌ను ఇవ్వడం ద్వారా నగరాలకు ర్యాంక్‌లు ఇచ్చారు.
చదవండి: ఎందుకీ గగ్గోలు?.. ఇప్పుడు ఎవరి ఇల్లు తగలబడుతోంది?   

మరిన్ని వార్తలు