11న అల్పపీడనం

9 Sep, 2021 02:53 IST|Sakshi
మంగమారిపేట బీచ్‌ వద్ద కోతకు గురైన తీరం

ఇప్పుడున్న అల్పపీడనం బలహీనం 

రాష్ట్రం నుంచి దూరంగా పయనం 

వర్షాలతో నీటమునిగిన తిమ్మాపురం 

అల్లకల్లోలంగా సముద్రం 

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడి మన రాష్ట్రం నుంచి దూరంగా వెళ్లిపోయింది. ఈనెల 11న ఉత్తర బంగాళాఖాతాన్ని అనుకుని మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. షీర్‌ జోన్‌ (ద్రోణి) సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు.


మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పాటు అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. విశాఖ జిల్లా తిమ్మాపురం గ్రామం బుధవారం నీట మునిగింది. కాపులుప్పాడ ప్రాంతంలో వరిపొలాల్లోకి నీరు చేరింది. మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లో సముద్ర కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. దీంతో మంగమారిపేట వద్ద సముద్ర తీరం కోతకు గురైంది. జిల్లాలోని ప్రధాన నదులైన తాండవ, శారద, వరాహ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. తాండవ, కల్యాణపులోవ జలాశయాలు నిండుగా ఉన్నాయి. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న మాచ్‌ఖండ్‌ జలవిద్యుత్‌ కేంద్రానికి నీరందించే ప్రధాన డుడుమ జలాశయంలో నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది.   

గెడ్డలో కొట్టుకుపోయి.. బయటపడిన పాల వ్యాపారి   
ఆనందపురం మండలం వెల్లంకికి చెందిన పోలయ్య పాల వ్యాపారం కోసం కాపులుప్పాడ వెళ్తుండగా పరదేశిపాలెం గెడ్డ వద్ద నీటి ఉధృతికి ద్విచక్ర వాహనం అదుపు తప్పింది. ద్విచక్ర వాహనంతో సహా కొట్టుకుపోయిన పోలయ్య.. అక్కడున్న కర్రల సహాయంతో ఒడ్డుకు చేరుకున్నాడు. మధ్యాహ్నం నీటి ఉధృతి తగ్గిన తర్వాత స్థానికుల సాయంతో ద్విచక్ర వాహనాన్ని ఒడ్డుకు చేర్చారు.  

మరిన్ని వార్తలు