వికేంద్రీకరణే విశాఖ వాణి

9 Oct, 2022 04:16 IST|Sakshi
వికేంద్రీకరణకు మద్దతుగా చేతులెత్తి సంఘీభావం తెలుపుతున్న నేతలు

మద్దతుగా 15న భారీ ర్యాలీకి సన్నాహాలు

దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తూ మన ఆకాంక్షను చాటాలని నేతల పిలుపు

నాన్‌ పొలిటికల్‌ జేఏసీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం 

సీఎం జగన్‌ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంఘీభావం

రాజీనామాలకు సిద్ధమన్న ఎమ్మెల్యేలు ధర్మశ్రీ, అవంతి 

ఇకపై నియోజకవర్గాలు, మండలాల వారీగా సమావేశాలు

పాలనా రాజధానిగా విశాఖ ఆవశ్యకతపై కార్యక్రమాలు

సాక్షి, విశాఖపట్నం: వికేంద్రీకరణకు మద్దతుగా, కేంద్రీకరణకు వ్యతిరేకంగా విశాఖ ప్రజలు దిక్కులు పిక్కటిల్లేలా గర్జించడానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ నెల 15న భారీ ర్యాలీ నిర్వహించాలని నాన్‌ పొలిటికల్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (జేఏసీ) నిర్ణయించింది. అన్ని వర్గాల వారు పాల్గొనే ఈ ర్యాలీని నగరంలోని డాబా గార్డెన్స్‌ అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి చేపట్టనున్నారు.

వికేంద్రీకరణకు మద్దతుగా నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పడ్డాక.. శనివారం విశాఖలోని ఓ హోటల్‌లో నిర్వహించిన తొలి రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఈ మేరకు ఏకగ్రీవంగా తీర్మానించింది. వికేంద్రీకరణతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించింది.

వికేంద్రీకరణకు మద్దతుగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావులు ఈ సమావేశంలో ప్రకటించారు. జేఏసీ చైర్మన్‌ లజపతిరాయ్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేధావులు, పారిశ్రామిక, విద్యావేత్తలు, ఉద్యోగ, కార్మిక, న్యాయవాద సంఘాల నేతలు, జర్నలిస్టు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.

తొలుత లజపతిరాయ్‌ మాట్లాడుతూ.. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. విశాఖ పాలనా రాజధాని అయ్యేంత వరకు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి పరిమితం కాకుండా రాష్ట్ర సమగ్రాభివృద్ధి జరగాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని చెప్పారు. జేఏసీ కో చైర్మన్‌ దేవుడు మాట్లాడుతూ అసమానతలతో కూడిన కేంద్రీకరణ వల్ల ఉత్తరాంధ్ర ప్రజలు చాలా నష్టపోయారని, అందుకే ఆర్థిక, సామాజిక వికేంద్రీకరణ జరగాలని చెప్పారు.

ఇందుకు హైదరాబాదే ఉదాహరణ అన్నారు. కేంద్రీకరణతో నష్టాలు, వికేంద్రీకరణ వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించాలన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయం అమలు కాకుండా ప్రతిపక్షాలు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నాయని, వాటిని సమైక్యంగా తిప్పికొడదామని పిలుపునిచ్చారు. వికేంద్రీకరణ, విశాఖ పాలనా రాజధాని కోసం స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించాలని ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్‌ఎస్‌ శివశంకర్‌ సూచించారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, వీఎంఆర్డీఏ చైర్‌పర్సన్‌ అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యే ఎస్‌కే రెహమాన్, ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధి ఎస్‌.రవీంద్ర, ఐఎన్‌టీయూసీ నాయకుడు మంత్రి రాజశేఖర్, వీజేఎఫ్‌ అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబు, మత్స్యకార నేత శాంతారాం, ఏయూ రిటైర్డ్‌ ప్రొఫెసర్లు సీహెచ్‌ వెంకట్రావు, విజయ్‌కుమార్, రిటైర్డ్‌ ఉద్యోగులు పాల్గొన్నారు. 
తణుకులో నిర్వహించిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో మంత్రి కారుమూరి, వంక రవీంద్రనాథ్, తదితరులు 
 
ఉప్పెనలా తరలిరావాలి

ఈనెల 15 విశాఖలో వికేంద్రీకరణకు మద్దతుగా నిర్వహించ తలపెట్టిన భారీ ర్యాలీకి ప్రజలు ఉప్పెనలా తరలి వచ్చి, తమ ఆకాంక్షను తెలియజేయాలి. ఆదివారం నుంచి మండల, వార్డు, నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు నిర్వహించి విశాఖ పాలనా రాజధాని ఆవశ్యకతను అన్ని వర్గాల ప్రజలకు తెలియజేయాలి.
– గుడివాడ అమర్‌నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
 
అవసరమైతే రాజీనామా చేస్తా 
విశాఖను పాలనా రాజధానిగా చేయడానికి మద్దతుగా అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను.  సంపద అంతా అమరావతిలోనే కేంద్రీకృతమైతే భవిష్యత్తులో ప్రత్యేక ఉత్తరాంధ్ర, ప్రత్యేక రాయలసీమ ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. విశాఖలో రాజధాని ఏర్పాటుకు ప్రైవేటు భూములు అవసరం లేదు. ప్రభుత్వ భూముల్లోనే ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్ర విభజన సమయంలోనే విశాఖను రాజధానిగా చేయాల్సింది. కానీ చంద్రబాబు స్వార్థంతో చేయలేదు.  
– అవంతి శ్రీనివాసరావు, భీమిలి ఎమ్మెల్యే  
 
స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా చేస్తున్నా.. 
మూడు రాజధానులకు మద్దతుగా నేను స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామా లేఖ సిద్ధం చేశాను. దానిని జేఏసీ చైర్మన్‌ లజపతిరాయ్‌కు అందజేస్తున్నా. వికేంద్రీకరణను వ్యతిరేకిస్తున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా తన పదవికి రాజీనామా చేయాలి. అప్పుడు ఎన్నికలకు వెళదాం. ఆ ఎన్నికల్లో గెలిచిన వారి నిర్ణయాన్ని ప్రజల మనోభావాలుగా గుర్తించడానికి టీడీపీ సిద్ధమా? 
– కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్, చోడవరం ఎమ్మెల్యే 
 
హేలన, సవాళ్లతో యాత్రలా?
అమరావతి రైతుల పేరిట చేస్తున్న పాదయాత్రలో ఉత్తరాంధ్ర వాసులను హేలన చేస్తున్నారు. సవాళ్లు విసురుతున్నారు. పాదయాత్ర అంటే ఇలా చేస్తారా? టీడీపీ సహా మరికొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు పాదయాత్రకు నిధులిచ్చి ప్రోత్సహిస్తున్నారు. వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యం. మూడు రాజధానులకు అడ్డంకులు సృష్టిస్తున్న వారికి మన నిరసన తెలపాల్సిందే.
– వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ 
 
అత్యధికులు వికేంద్రీకరణ వైపే మొగ్గు
రాష్ట్రంలో 75 శాతం మంది వికేంద్రీకరణకే మొగ్గు చూపుతున్నారు. కేవలం 5 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. 20 శాతం మంది తటస్థంగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 80 శాతం మంది అనుకూలంగా, 15 శాతం మంది తటస్థంగా, 5 శాతం ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రాజధానులకు అనుకూలంగా ర్యాలీలు నిర్వహించాలి. విశాఖ రాజధాని అయితే రాష్ట్రమంతటికీ మేలు జరుగుతుంది.
– బాలమోహన్‌దాస్, ఏఎన్‌యూ పూర్వ వైస్‌ ఛాన్సలర్‌ 
 
బాబు నేతృత్వంలోనే పాదయాత్ర 
చంద్రబాబు నేతృత్వంలోనే అమరావతి రైతుల పేరిట పాదయాత్ర జరుగుతోంది. అమరావతే అభివృద్ధి చెందాలని పనిగట్టుకుని ఎల్లో మీడియా అదేపనిగా వారికి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తోంది. ఏపీకి ఆర్థిక పరిపుష్టి వికేంద్రీకరణతోనే సాధ్యం. ఒకే ప్రాంతంలో అభివృద్ధి కేంద్రీకృతమైతే ఇతర ప్రాంతాల వారంతా చాలా నష్టపోతారనడంలో సందేహం లేదు. 
– కేకే రాజు, నెడ్‌క్యాప్‌ చైర్మన్‌

మరిన్ని వార్తలు