ఉక్కు పరిపాలన భవనం ముట్టడికి యత్నం

18 Aug, 2021 04:53 IST|Sakshi
ఉక్కు పరిపాలన భవనం గేటు వద్ద ప్రసంగిస్తున్న కమిటీ చైర్మన్‌ నర్సింగరావు

టెండర్లు వేయడానికి ఎవరైనా వస్తే తరిమికొడతామన్న కార్మికులు 

వర్షంలోనూ కొనసాగిన విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమం

ఉక్కు నగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉక్కు పరిరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. మంగళవారం ఉక్కు పరిపాలనా భవనం ముట్టడికి కార్మికులు యత్నించారు. భవనం వద్దకు చేరుకున్న కార్మికులు కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యమాన్ని కొనసాగించారు. ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు ఉద్దేశించిన సలహాదారుల నియామకానికి టెండర్లు వేయడానికి ఎవరైనా విశాఖ వస్తే తరుముతామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చి ప్రజా సంపదను తన తాబేదార్లకు కట్టబెట్టడంలో భాగంగా విశాఖ ఉక్కును నూరు శాతం అమ్మాలని నిర్ణయం తీసుకుందన్నారు.

ఇక్కడి ప్రజా పోరాటాన్ని చూసి గుత్తేదారులు ఎవరూ ఈ ప్రక్రియలో భాగస్వామ్యం కాలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ ప్రక్రియను కొనసాగించాలని చూస్తే సహించేది లేదన్నారు. వైఎస్సార్‌ సీపీ గాజువాక నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో మెజార్టీ ఉంది కదా అని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండుసార్లు ప్రధానికి లేఖ రాసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందన్నారు. అయినప్పటికి తమ ఉద్యమం ఆగబోదన్నారు. కార్యక్రమంలో పోరాట కమిటీ ప్రతినిధులు సీహెచ్‌.నర్సింగరావు, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కేఎస్‌ఎన్‌ రావు, వై.మస్తానప్ప, జి.గణపతిరెడ్డి, బొడ్డు పైడిరాజు, విళ్లా రామ్మోహన్‌కుమార్, డి.సురేష్‌బాబు, వరసాల శ్రీనివాస్, డేవిడ్, ఎన్‌.రామారావు, నీరుకొండ రామచంద్రరావు, మాటూరి శ్రీనివాసరావు, నిర్వాసిత నాయకులు పులి రమణారెడ్డి, ముత్యాలు, ఎం.శంకరనారాయణ, పల్లా పెంటారావు తదితరులు పాల్గొన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు