నిరంతరాయంగా స్టీల్‌ప్లాంట్‌ ఆక్సిజన్‌

16 May, 2021 05:25 IST|Sakshi
స్టీల్‌ప్లాంట్‌లో ట్యాంకర్లలోకి ఆక్సిజన్‌ లోడింగ్‌

24 గంటల్లో 180 టన్నులు సరఫరా చేసిన స్టీల్‌ ప్లాంట్‌

ఉక్కునగరం (గాజువాక): కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు 150 టన్నులు, కర్నాటకకు 30 టన్నుల ఆక్సిజన్‌ సరఫరా చేసినట్టు స్టీల్‌ప్లాంట్‌ వర్గాలు తెలిపాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఈ తరుణంలో స్టీల్‌ప్లాంట్‌ ఉత్పత్తి ప్రక్రియలో తయారయ్యే లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను పలు రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది. గత ఏడాదిలో వచ్చిన కరోనా మొదటి దశలో కూడా విశాఖ స్టీల్‌ప్లాంట్‌ లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. ప్రస్తుత రెండో దశలో గత నెల 13 నుంచి ఇప్పటివరకు 4,800 టన్నుల ఆక్సిజన్‌ను సరఫరా చేసింది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు మొత్తం 13,650 టన్నుల ఆక్సిజన్‌ను స్టీల్‌ప్లాంట్‌ సరఫరా చేసింది. 

>
మరిన్ని వార్తలు