భగ్గుమన్న స్టీల్‌ ప్లాంట్‌ కార్మిక వర్గం

9 Mar, 2021 02:51 IST|Sakshi
కూర్మన్నపాలెం కూడలిలో బైఠాయించిన కార్మీకులు

నిర్మల ప్రకటనపై ఆగ్రహం 

పెద్ద ఎత్తున రాస్తారోకో 

ఉక్కునగరం (గాజువాక): విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన ప్రకటనపై ఉక్కు కార్మీక వర్గం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉక్కు కార్మీకులు కూర్మన్నపాలెం కూడలి వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయానికి నిరసనగా గత 25 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. సోమవారం మంత్రి ప్రకటన తెలిసిన వెంటనే స్టీల్‌ప్లాంట్‌ కార్మీక నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై బైఠాయించి ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది.

పోలీసులు సర్దిచెప్పటానికి ప్రయత్నించినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. ఇంతలో అక్కడికి యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తిరాజు వచ్చారు. ఆయన కారును ఆందోళనకారులు కొద్దిసేపు అడ్డుకున్నారు. సాయంత్రం 6.30కి ప్రారంభమైన రాస్తారోకో రాత్రికి కూడా కొనసాగింది,. పోరాట కమిటీ నాయకులు జె.అయోధ్యరామ్, డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, విళ్లా రామ్మోహన్‌కుమార్, వి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్రం చేసిన ప్రకటన దుర్మార్గమైనదన్నారు. ప్రతి ఆంధ్రుడు ఖండిస్తున్నారన్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు