విశాఖ స్టీల్ ప్లాంట్‌: కొనసాగుతున్న భారీ నిరసన ర్యాలీ

10 Jul, 2021 15:33 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్లాంట్‌ కార్మికులు చేపట్టిన 30 కిలోమీటర్ల భారీ నిరసన ర్యాలీ కొనసాగుతోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కార్మికులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ నిరసన చేస్తున్నారు. స్టీల్ పరిరక్షణా పోరాట కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు స్టీల్ ప్లాంట్ కూర్మన్నపాలెం గేట్ నుంచి ర్యాలీగా బయలుదేరాయి. వేలాదిమంది కార్మికులు నిరసన ర్యాలీలో భాగంగా కూర్మన్నపాలెం, వడ్లపూడి, గాజువాక మీదుగా ముందుకు సాగుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై కార్మిక సంఘాలు మండి పడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం వద్ద చేపట్టిన దీక్షలు 150వ రోజుకు చేరాయి. కార్మికుల దీక్షలు జీవీఎంసీ వద్ద 100వ రోజుకు చేరాయి. ఈ నేపథ్యంలో  స్టీల్‌ ఉద్యమానికి మద్దతు కోరిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఉత్తరాంధ్ర జిల్లాల ఎంపీలను కలిసింది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం అన్ని వర్గాల సహకారంతో ఉద్యమిస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్య రామ్ పేర్కొన్నారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై పలువురి అభిప్రాయాలు

అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలి: సీపీఎం నర్సింగరావు
స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు సొంతంగా గనులు కేటాయించాలని , సీపీఎం  నర్సింగరావు డిమాండ్‌ చేశారు. 32 మంది ప్రాణత్యాగాలతో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పడిందని గుర్తు చేశారు. కరోనా సమయంలోనూ స్టీల్‌ ప్లాంట్‌ ఉత్పత్తి ఆపలేదన్నారు. అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రం గౌరవించాలని ఆయన కోరారు.

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదు: గఫూర్‌
స్టీల్‌ప్లాంట్‌ కోసం పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని సీఐటీయూ నేత గఫూర్‌ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ మూర్ఖంగా పాలిస్తున్నారని, ఆయనకి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.

లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్‌ ఉపాధి కల్పిస్తోంది: అయోధ్యరామ్
స్టీల్‌ప్లాంట్‌ రూ.వేలకోట్ల పన్నులు కడుతుంటే ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏంటని స్టీల్‌ప్లాంట్‌ పోరాట కమిటీ కన్వీనర్‌ అయోధ్యరామ్‌ తెలిపారు. సీఎం జగన్‌ లేఖలకు కేంద్రం సమాధానం ఇవ్వలేదని, అసలు హోదా లేదు, రాష్ట్రానికి ఒక్క పరిశ్రమైనా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. లక్షలాదిమందికి స్టీల్‌ప్లాంట్‌ ఉపాధి కల్పిస్తోందన్నారు.

►ప్రజల ఆకంక్ష మేరకు ప్రధాని మోదీ నడుచుకోవాలని, స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని  వైఎస్‌ఆర్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేత మస్తానప్ప ​కోరారు


మరిన్ని వార్తలు