వాస్తవం ఆవిష్కృతం

5 Mar, 2023 02:56 IST|Sakshi
నూతన పారిశ్రామిక యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ జీఐఎస్‌.. ఆ వెంటనే  అమలుకు కార్యాచరణ ప్రారంభం

సీఎస్‌ అధ్యక్షతన కమిటీని నియమిస్తున్నట్టు సీఎం ప్రకటన

చంద్రబాబు హయాంలో డ్రైవర్లకు సూట్లు తొడిగి హంగామా.. నాడు రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులంటూ ప్రచారం.. 10% కూడా రాలేదు

టీడీపీ హయాంలో సదస్సుల వైపు కన్నెత్తి కూడా చూడని అంబానీ.. తొలిసారి జీఐఎస్‌కు హాజరు

విశాఖ జీఐఎస్‌ వేదిక నుంచి సాక్షి ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెబుతున్న విధంగా వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించింది. గత సర్కారు హయాంలో మాదిరిగా పెట్టుబడుల సదస్సు పేరిట హంగు, ఆర్భాటాలు కాకుండా దేశ, అంతర్జాతీయ కార్పొరేట్‌ దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్‌ ప్రతిష్టను ఇనుమడింప చేసింది.

టీడీపీ అధికారంలో ఉండగా సదస్సుకు ఊరు పేరు తెలియని సంస్థలు, డ్రైవర్లను తరలించి సూటు బూటు వేసి భారీ సంఖ్యలో ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకుంది. నాడు చంద్రబాబు సర్కారు నాలుగు సమ్మిట్స్‌ ద్వారా రూ.18 లక్షల కోట్లకు పైగా పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు ప్రచారం చేసుకోగా కనీసం పది శాతం కూడా వాస్తవరూపం దాల్చలేదు. 

తొలిసారిగా అంబానీ రాక
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను రప్పించడం, యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా తాజాగా నిర్వహించిన విశాఖ సదస్సుకు రిలయన్స్, అదానీ, జేఎస్‌డబ్ల్యూ, జిందాల్, ఒబెరాయ్, దాల్మియా, బంగర్, బజాంకా తదితర పారిశ్రామిక దిగ్గజాలను ఒకే వేదికపైకి తీసుకొచ్చి పెట్టుబడుల ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంది. చంద్రబాబు హయాంలో నిర్వహించిన సదస్సులకు నాలుగేళ్లలో ఒక్కసారి కూడా ముఖేష్‌ అంబానీ హాజరు కాకపోవడం గమనార్హం. దక్షిణాదిలో  ఏ ఒక్క రాష్ట్రంలోనూ పెట్టుబడుల సమావేశానికి ఆయన హాజరైన దాఖలాలు లేవు.

ఈ నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారి నిర్వహించిన పెట్టుబడుల సమావేశానికి భారీ సంఖ్యలో పారిశ్రామిక దిగ్గజాలు హాజరు కావడం వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంపై కార్పొరేట్ల నమ్మకానికి నిదర్శనమని పారిశ్రామిక వర్గాలు పేర్కొంటున్నాయి. 

దుష్ప్రచారానికి చెంపపెట్టులా సదస్సు  
విశాఖ సమ్మిట్‌ ద్వారా ఒక్క సమావేశంతో రికార్డు స్థాయిలో రూ.13.4 లక్షల కోట్లకుపైగా విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి. ఒప్పందం చేసుకున్న కంపెనీలన్నీ అంతర్జాతీయంగా పేరు పొందినవే. థర్మల్‌ పవర్‌ నుంచి గ్రీన్‌ ఎనర్జీ రంగంలోకి అడుగుపెట్టిన కేంద్ర ప్రభుత్వ రంగ నవరత్న కంపెనీ ఎన్‌టీపీసీ అందుకు రాష్ట్రాన్ని వేదికగా చేసుకుని రూ.2.35 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేలా మూడు ఒప్పందాలను కుదుర్చుకుంది.

రిలయన్స్, ఏబీసీ, జేఎస్‌డబ్ల్యూ ఆదిత్య బిర్లా, జిందాల్, ఫ్యూచర్, అదానీ, ఐవోసీఎల్‌ , అరబిందో, హీరో తదితర దిగ్గజ కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వంపై ఓ వర్గం మీడియా తరచూ చేస్తున్న దుష్ప్రచారానికి తాజా సదస్సు చెంపపెట్టు లాంటిదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి సదస్సులకు గతంలో ఒకరిద్దరు మాత్రమే ప్రముఖులు హాజరయ్యే వారని అలాంటిది ఈసారి ఇంతమంది కార్పొరేట్‌ దిగ్గజాలు ఒకేసారి రావటాన్ని నమ్మలేకపోతున్నామని సమావేశానికి హాజరైన ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒకరు పేర్కొన్నారు.

కార్యాచరణ ప్రారంభం
కేవలం పెట్టుబడుల ఒప్పందాలను కుదుర్చుకుని వదిలేయడం కాకుండా అమల్లోకి తెస్తూ కార్యాచరణను సైతం రాష్ట్రం ప్రభుత్వం వెంటనే ప్రారంభించింది. ఒప్పందాలను వేగంగా వాస్తవ రూపంలోకి  తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన పర్యవేక్షణ కమిటీని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించారు. త్వరగా కార్యరూపం దాల్చే ఒప్పందాలకు ఎర్లీబర్డ్‌ రాయితీలు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్‌ తెలిపారు. 

ఆరోగ్య రంగంలో ఆదర్శ రాష్ట్రం 
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ద్వారా పెట్టుబడులకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతంగా మారింది. హెల్త్‌కేర్‌ విభాగంలో దేశానికి ఆదర్శంగా నిలిచే సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉంది. పారిశ్రామికంగానే కాకుండా రాష్ట్రం సామాజికంగా పురోగమించడంలో సీఎం జగన్‌ చేస్తున్న కృషి అభినందనీయం. విశాఖ మరింతగా ఎదుగుతుంది. విశాఖలో మాకు 5 ఫార్ములేషన్‌ యూనిట్లు, రెండు బల్క్‌ డ్రగ్‌ యూనిట్లు ఉన్నాయి. మున్ముందు కూడా పెట్టుబడులను కొనసాగిస్తాం.  – డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబొరేటరీస్‌  చైర్మన్‌ సతీష్‌రెడ్డి 

రెండేళ్లలో  రూ.2 వేల కోట్లు 
ఇప్పటికే ఫార్మా రంగంలో ఏపీ తనదైన ముద్ర వేసింది. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న చొరవ, సీఎం జగన్‌ సహకారం వల్ల ఏపీ వైపు చూస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ఏపీలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెడతాం. దీని ద్వారా కనీసం 3,000  మందికి ఉపాధి లభిస్తుంది.  – వంశీకృష్ణ బండి, హెటిరో  గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ 

‘అపాచీ’ మరో  100 మిలియన్‌ డాలర్లు 
అపాచీకి చైనా, భారత్, వియత్నాంలో ప్లాంట్లు ఉండగా ఏపీ ప్లాంటే అతి పెద్దది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెడుతున్నాం. ఇప్పటికే 100 మిలియన్‌ డాలర్లు వెచ్చించాం. మరో 100 మిలియన్‌ డాలర్ల (రూ. 820 కోట్లు) పెట్టుబడు­ల కోసం ప్రభుత్వంతో ఒప్పందం కుదు­ర్చుకున్నాం. తద్వారా 10 వేల మందికి ఉద్యోగాలు లభి­స్తాయి. ప్రభుత్వ విధానాల వల్ల వ్యాపారాల నిర్వహ­ణ సుల­భతరంగా మారిందనడానికి మా సంస్థే ఉదాహరణ.  – అపాచీ ఇండియా డైరెక్టర్‌ సెర్గియో లీ 

‘దివీస్‌’ రెండు కొత్త ప్లాంట్లు 
రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు  నెలకొల్పబోతున్నాం. రూ.780 కోట్ల ప్రతిపాదన ఆమోదం పొందగా.. మరో రూ.700 కోట్ల ప్రతిపాదనలకు సంబం ధించి ఒప్పందం కుదుర్చుకున్నాం. దీంతో అదనంగా 22 వేల ఉద్యోగాల కల్పన జరగనుంది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ వల్ల రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయి.  – దివీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మధుబాబు  

మరిన్ని వార్తలు