జోరువానలోనూ ఉక్కు సంకల్పం

3 Aug, 2021 03:54 IST|Sakshi
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాలో పాల్గొన్న విశాఖ ఉక్కు కర్మాగారం ఉద్యోగులు

ఢిల్లీలో మార్మోగిన ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’

పోలీస్‌ ఆంక్షలు, వర్షంలోనూ కొనసాగిన ధర్నా 

ఎటు చూసినా అడ్డంకులే

సంఘీభావం ప్రకటించిన వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదాలతో సోమవారం దేశ రాజధాని ఢిల్లీ దద్ధరిల్లింది. బ్యారికేడ్లు, పోలీస్‌ ఆంక్షలను ఛేదించుకుని ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని జంతర్‌ మంతర్‌ సాక్షిగా ఎలుగెత్తి చాటారు. కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన గళాన్ని వినిపించేందుకు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరుకున్న కార్మికులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. విశాఖ నుంచి రైలు ద్వారా ఢిల్లీ చేరుకున్న కార్మికులను తిరిగి వెళ్లాలని ఒత్తిడి చేశారు. వారు బస చేసిన హోటళ్ల నుంచి బయటికి రాకుండా ఆంక్షలు విధించారు. అయినప్పటికీ ధర్నా సమయానికి జంతర్‌మంతర్‌ చేరుకున్న కార్మికులు జోరువానలోనూ నిరసన గళాన్ని వినిపించారు. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, సీపీఎం, íసీపీఐ, ఎల్‌జేడీ, ఏఐకేఎస్, ఏఐఏడబ్ల్యూయూయూ, ఐద్వా సంఘీభావం తెలిపాయి. 

పోరాడి అడ్డుకుంటాం..
ప్రజల త్యాగాలతో ఏర్పాటైన ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించకుండా పార్లమెంట్‌లో పోరాడుతామని సీపీఎం పార్లమెంటరీ పార్టీ నేత ఎలమరం కరీం ప్రకటించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ప్రధాని మోదీ సర్కార్‌ వేగవంతం చేసిందని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ విమర్శించారు. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నించకుండా దేశ సంపదను ప్రైవేట్‌పరం చేయడంపైనే కేంద్రం మొగ్గు చూపుతోందన్నారు. ప్రజా ఉద్యమంతో తిరుగుబాటు కచ్చితంగా జరుగుతుందని, స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమంతో ఇది ప్రారంభమైందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగుల పోరాటం దేశ భవిష్యత్తుకు సంబంధించిన అంశమని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు పేర్కొన్నారు. పలు అంశాల్లో ఏకాభిప్రాయం లేని పార్టీలు సైతం విశాఖ ఉక్కు కోసం ఐక్యంగా పోరాడుతున్నాయని, ఈ పంథాను ఇలాగే కొనసాగించాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు అందించిన సహకారం మరిచిపోలేనిదని ఏఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ చెప్పారు. కార్మికుల ఉద్యమానికి రైతులు అండగా ఉంటారని తెలిపారు. స్టీల్‌ ప్లాంట్‌ మాదిరిగానే దేశంలో వ్యవసాయాన్ని కార్పొరేట్లకు విక్రయించేందుకు మోదీ ప్రభుత్వం సిద్ధపడిందని ఏఐకేఎస్‌ సహాయ కార్యదర్శి విజూకృష్ణన్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అనేక విషయాల్లో మూర్ఖత్వంతో వ్యవహరిస్తోందని, అన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నా ఏమాత్రం పట్టించుకోవట్లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఒకవైపు విశాఖ ఉక్కు నాణ్యమైనదంటూ ప్రకటించి మరోవైపు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని కాంగ్రెస్‌ నేతలు గిడుగు రుద్రరాజు, సుంకర పద్మశ్రీ హెచ్చరించారు. కలసికట్టుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుందామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ సూచించారు.

వైఎస్సార్‌సీపీ సంఘీభావం
ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటంచేసి విశాఖ ఉక్కును కాపాడుకుందామని పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్‌పరం కాకుండా జరిపే పోరాటంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సంఘీభావం సంపూర్ణంగా ఉంటుందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం పావులు కదుపుతున్నట్లుగా తెలిసిన వెంటనే సీఎం వైఎస్‌ జగన్‌ విశాఖలో ప్రత్యామ్నాయ మార్గాలపై కార్మిక సంఘాల నేతలతో గత ఫిబ్రవరిలో చర్చించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారన్నారు. కర్మాగారానికి సొంతంగా ఇనుప ఖనిజం, బొగ్గు గనులు కేటాయించాలని.. అలాగే, రూ.22 వేల కోట్ల రుణ భారానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులపై రెండేళ్లపాటు మారటోరియం విధించాలని విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు.  
విజయసాయిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘం నేతలు  

మరిన్ని వార్తలు