రక్షణ రంగానికి బ్రాండ్‌గా విశాఖ 

22 Aug, 2023 04:18 IST|Sakshi

అభివృద్ధికి పుష్కల అవకాశాలున్నాయి

ఇందుకు ఎక్కువ సమయం పట్టదు 

డీఆర్‌డీవో డైరెక్టర్‌ జనరల్‌ డా.వై.శ్రీనివాసరావు

సొంతంగా సబ్‌మెరైన్లు తయారు చేస్తున్నాం

నౌకలు, సబ్‌మెరైన్లను శత్రువులు కనిపెట్టకుండా కొత్త టెక్నాలజీ 

సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారేందుకు, నేవల్‌ ఎకో సిస్టమ్‌ అభివృద్ధికి విశాఖపట్నంలో పుష్కల అవకాశాలున్నాయని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో) నేవల్‌ సిస్టమ్స్‌ అండ్‌ మెటీరియల్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ డా.వై శ్రీనివాసరావు అన్నారు. నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ల్యాబొరేటరీ(ఎన్‌ఎస్‌టీఎల్‌)లో శనివారం జరిగిన 54వ ల్యాబ్‌ రైజింగ్‌ డే ఉత్సవాల్లో పాల్గొన్న అనంతరం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ‘విశాఖపట్నంలో నేవల్‌ ఎకో సిస్టమ్‌ మరింత అభివృద్ధి చెందితే అత్యవసర పరిస్థితుల్లో సహకారం అందించేందుకు అవసరమైన మానవ వనరులు, మెషినరీ అందుబాటులోకి వస్తాయి.

నేవల్‌ డిఫెన్స్‌ అంటే విశాఖ గుర్తుకురావాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేస్తున్నాయి. హిందూస్తాన్‌ షిప్‌యార్డు, పోర్టులకు సంబంధించిన పరికరాలు, కమర్షియల్‌ నేవీ, ఇండియన్‌ నేవీకి ఏ పారిశ్రామిక సహకారం కావాలన్నా.. విశాఖ అత్యంత ముఖ్యమైన వనరు. రక్షణ రంగానికి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తే.. విశాఖలో నేవల్‌ ఎకో సిస్టమ్‌ మరింత అభివృద్ధి చెందుతుంది.

డాక్‌యార్డు, ఎన్‌ఎస్‌టీఎల్, నేవీ, షిప్‌యార్డుకు సహకారం అందించేలా బీఈఎల్‌ మాదిరిగా ఎల్‌అండ్‌టీ వంటి సంస్థలు వస్తే.. ఆ వెంటే ఎంఎస్‌ఎంఈలు కూడా ఏర్పాటవుతాయి. తద్వారా విశాఖ రక్షణ రంగానికి ఒక బ్రాండ్‌గా మారే అవకాశముంది. విశాఖ సమీప ప్రాంతాల్లో పోర్టులు, భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు, రాజమండ్రి ఎయిర్‌పోర్టు, రైల్వే వ్యవస్థ కూడా ఉన్నందున.. అభివృద్ధి చెందేందుకు ఎక్కువ సమయం పట్టదు. 

సొంతంగా సబ్‌మెరైన్లు, టార్పెడోలు.. 
సముద్ర గర్భంలోనూ సత్తా చాటే దిశగా అడుగులు పడుతున్నాయి. వరుణాస్త్ర విజయవంతమైంది. హెవీ వెయిట్, లైట్‌ వెయిట్‌ టార్పెడో ప్రయోగాలు విజయవంతమయ్యాయి.  బ్యాటరీ ప్రొపల్షన్‌ టార్పెడోలు ప్రస్తుతం కీలకంగా మారాయి. క్షణాల్లో టార్పెడోలు దూసుకుపోయేలా బ్యాటరీల రూపకల్పన జరుగుతోంది. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

టార్పెడోలను సమర్థంగా కంట్రోల్‌ చేసే వ్యవస్థ కూడా సిద్ధమవుతోంది. నౌకలు, సబ్‌మెరైన్ల మోడల్‌ టెస్టింగ్స్‌ కోసం ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడే వాళ్లం. ఇప్పుడు అన్ని షిప్‌యార్డులూ ఎన్‌ఎస్‌టీఎల్‌ వైపే చూస్తున్నాయి. ఇప్పుడు సబ్‌మెరైన్లను సొంతంగా తయారు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అలాగే యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్‌లు, యుద్ధ నౌకల ఉనికిని శత్రుదేశాలు పసిగట్టకుండా అడ్డుకునే స్టెల్త్‌ టెక్నాలజీ అందుబాటులోకి తెస్తున్నాం. శత్రుదేశాలు ఏ ఆయుధాన్ని ప్రయోగించినా.. దాని నుంచి తప్పించుకునేందుకు అవసరమైన టెక్నాలజీ రూపకల్పనకూ ప్రయోగాలు జరుగుతున్నాయి’ అని చెప్పారు      
 

మరిన్ని వార్తలు