ఐటీ కేంద్రంగా విశాఖ

17 Feb, 2023 03:52 IST|Sakshi
సదస్సుకు హాజరైన దేశ, విదేశీ విద్యార్థులు

సాక్షి, విశాఖపట్నం: దిగ్గజ ఐటీ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. సమీప భవిష్యత్తులో విశాఖ ఐటీ డెస్టినీగా అవతరించనుందని, మరిన్ని టెక్‌ కంపెనీలు ఏర్పాటయ్యేలా సీఎం జగన్‌ కృషి చేస్తున్నారని చెప్పారు. విశాఖ, తిరుపతి, అనంతపురంలో ఇప్పటికే ఐటీ పార్కులు ఏర్పాటు కాగా  భోగాపురంలో త్వరలోనే కొత్త ఐటీ పార్క్‌ రానుందని వివరించారు.

కరోనా తర్వాత ఐటీ ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం అనుసరించగా రాష్ట్రంలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్‌ అనే నూతన విధానాన్ని సీఎం జగన్‌ తీసుకొచ్చారని పేర్కొన్నారు. గురువారం విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం, పల్సస్‌ గ్రూప్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ – 2023ని ప్రారంభించిన అ­నం­తరం మంత్రి విడదల రజిని, ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర, పల్సస్‌ సీఈవో గేదెల శ్రీనుబాబుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు.

ఆధునిక ఆవిష్కరణలతో పాటు ఐటీ, ఫార్మా, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులకు సంబంధించి ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది. జీ–20 దేశాలతో పాటు వివిధ దేశాలకు చెందిన 300 కంపెనీలకు చెందిన ప్రతినిధులు సదస్సుకు  హాజరయ్యారు. ఈ సందర్భంగా యూ­రో­పియన్‌ బిజినెస్‌ అండ్‌ టెక్నాలజీ సెంటర్‌(ఈబీటీసీ), నేషనల్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఆర్‌డీసీ) మధ్య సైన్స్,  టెక్నాలజీపై ఎంవోయూ కుదిరింది.

సదస్సు­లో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, బ్రిటిష్‌ హై కమిషన్‌ ఇన్‌ ఇండియా ప్రగ్యా చతుర్వేది, సెంట్రల్‌ డ్రగ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఏడీసీ అభిజిత్‌ ఘోష్, ఎన్‌ఆర్‌డీసీ సీఎండీ కమడోర్‌ అమిత్‌ రస్తోగి, జీ 20 నేషనల్‌ కోఆర్డినేటర్‌ డా.నవ సుబ్రహ్మణ్యన్‌తో పాటు సియోల్, టోక్యో, రోమ్, పారిస్, న్యూ­యార్క్, మెల్‌బోర్న్, బీజింగ్, లండన్‌ తదితర దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రపంచం చూపు.. విశాఖ వైపు 
భవిష్యత్తు టెక్నాలజీని రూపొందించేందుకు గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ గేట్‌ వే లాంటిది.  ప్రపంచం చూపు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో అగ్ర భాగాన ఉన్న  విశాఖ వైపే ఉంది.  డిజిటల్‌ భారత్‌ లక్ష్యమైన సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవస్థాపకతతో నడిచే కొత్త భారత్‌ను సృష్టించాలి.

డిజిటల్‌ అక్షరాస్యతను ప్రోత్సహించడం, డిజిటల్‌ మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్‌ సేవల విస్తరణ, కృత్రిమ మేధస్సు, బ్లాక్‌చెయిన్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను స్వీకరించడం వంటివి అమలు చేసే దిశగా వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో గ్లోబల్‌ టెక్‌ సమ్మిట్‌ ఏర్పాటు చేశాం.
– గేదెల శ్రీనుబాబు, పల్సస్‌ గ్రూప్‌ సీఈవో

డిజిటల్‌ హెల్త్‌లో రికార్డు 
డిజిటల్‌ హెల్త్‌కేర్‌లో విప్లవాత్మక మార్పులకు ఆంధ్రప్రదేశ్‌ నాంది పలికింది. మారుమూల ప్రాంతాలకు వైద్య సేవలు అందుతున్నాయి. ప్రస్తుతం రోజూ 66 వేల మందికి టెలి కన్సల్టెన్సీ సేవలంది­స్తున్నాం. రాష్ట్రంలో నాడు–నేడు ద్వారా ఆసుపత్రులు గణనీయంగా అభివృద్ధి చెందాయి. 17 మెడికల్‌ కాలేజీలు నిర్మాణ దశలో ఉన్నాయి. డిజిటల్‌ హెల్త్‌లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రికార్డు సృష్టించింది. ముఖ్యమంత్రి జగన్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పేదలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందచేస్తున్నారు. 
– విడదల రజిని, వైద్యారోగ్య శాఖ మంత్రి

జనం మెచ్చిన గిరిజన ఉత్పత్తులు
టెక్నాలజీ ద్వారా అటవీ ఉత్పత్తులకు ప్రాచుర్యం పెరుగుతుంది. గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ప్రవేశపెట్టిన ఈ కామర్స్, ఈ ప్రొక్యూర్‌మెంట్‌ విధానం ఇందుకు నిదర్శనం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన అరకు కాఫీ, తేనె, పసుపు, చింతపండు వంటి ఉత్పత్తులు ఇప్పుడు అమెజాన్‌ లాంటి ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ సంస్థల ద్వారా ప్రపంచానికి చేరువయ్యాయి. తద్వారా గిరిజనులకు ఆర్థిక పరిపుష్టి కల్పించినట్లైంది. 
– పీడిక రాజన్నదొర, ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి 

మరిన్ని వార్తలు