యమహా నగరి.. విశాఖ పురి

27 Jun, 2021 11:28 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: స్మార్ట్‌ సిటీగా కొత్త రూపు దిద్దుకుంటున్న విశాఖ.. దేశంలోని ప్రధాన నగరాలతో పోటీపడుతోంది. అవార్డులు, ర్యాంకింగ్‌లోనూ అదే దూకుడు ప్రదర్శిస్తోంది. క్లైమేట్‌ స్మార్ట్‌సిటీస్‌ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ర్యాకింగ్స్‌లో మొత్తం 123 నగరాలు పోటీపడగా.. 9 నగరాలకు మాత్రమే 4 స్టార్‌ రేటింగ్‌ దక్కగా.. అందులో విశాఖ స్థానం సంపాదించుకుంది. అర్బన్‌ ప్లానింగ్, గ్రీన్‌ కవర్‌ అండ్‌ బయోడైవర్సిటీ విభాగంతో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సత్తా చాటి ఏకంగా 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. మురుగునీటి నిర్వహణలో వినూత్న పద్ధతుల్ని అవలంబిస్తున్న జీవీఎంసీ.. ఆ విభాగంలో 3 స్టార్‌ రేటింగ్‌ సొంతం చేసుకుంది.

కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ సంయుక్తంగా 2019–20 నుంచి స్మార్ట్‌సిటీ ర్యాంకింగ్స్‌ ప్రకటిస్తున్నారు. పట్టణ ప్రణాళిక, జీవవైవిధ్యం, ఎనర్జీ, గ్రీన్‌బిల్డింగ్, ఎయిర్‌క్వాలిటీ, వాటర్‌ మేనేజ్‌మెంట్, వ్యర్థాల నిర్వహణ మొదలైన అంశాలపై ర్యాంకింగ్స్‌ ఇస్తున్నారు. గతేడాది 9వ ర్యాంకు సాధించిన విశాఖ నగరం.. 2020–21లో మాత్రం సత్తా చాటింది. క్‌లైమేట్‌ స్మార్ట్‌ సిటీస్‌ అసెస్‌మెంట్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0 ఓవరాల్‌ ర్యాంకింగ్స్‌లో మొత్తం 9 నగరాలకు 4 స్టార్‌ రేటింగ్‌ ఇవ్వగా అందులో విశాఖపట్నం కూడా నిలిచింది. ఇక వివిధ విభాగాల్లో ప్రకటించిన ర్యాంకుల్లో విశాఖ నగరం సత్తా చాటింది.

అర్బన్‌ప్లానింగ్, గ్రీన్‌ కవర్‌ అండ్‌ బయోడైవర్సిటీ విభాగంలో ఇండోర్, సూరత్‌తో కలిసి వైజాగ్‌ 5 స్టార్‌ రేటింగ్‌ పంచుకుంది. వ్యర్థాల నిర్వహణ విభాగంలో 5 స్టార్, ఎనర్జీ అండ్‌ గ్రీన్‌ బిల్డింగ్స్‌ విభాగంలో, మొబిలిటీ అండ్‌ ఎయిర్‌క్వాలిటీ విభాగంలో, మురుగునీటి నిర్వహణలోనూ 3 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. రెండేళ్ల కాలంలో విశాఖ నగరంలో వచ్చిన వినూత్న మార్పులతో ‘స్టార్‌ సిటీ’గా రూపాంతరం చెందుతోంది. 

వ్యర్థాల నిర్వహణలోనూ స్టారే.. 
జీవీఎంసీ వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2018–19లో 23వ ర్యాంక్‌కు పడిపోవడంతో.. పటిష్ట చర్యలకు అమలు చేసింది. బయోమైనింగ్, ఘన వ్యర్థాల నిర్వహణని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించింది. కాపులుప్పాడ డంపింగ్‌ యార్డులో 20 ఏళ్లుగా పేరుకుపోయిన వ్యర్థాల్ని 25 ఎకరాల్లో ఆధునిక బయోమైనింగ్‌ పద్ధతు ల్లో తొలగిస్తున్నారు. అదేవిధంగా చెత్త నుంచి విద్యుత్‌ తయారు చేసే ఎనర్జీ ప్లాంట్‌ నిర్మాణం చేపడుతోంది. అందుకే ఈ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. 

పర్యావరణహిత నగరంగా... 
నగరంలో రెండేళ్లుగా పర్యావరణ పరిరక్షణపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టిసారించింది. సీడ్‌బాల్స్‌ రూపంలో లక్షకు పైగా విత్తనాలు, 58,456 మొక్కలు నాటింది. దీనికితోడు మియావాకీ చిట్టడవులు, పార్కులు ఏర్పాటు చేయడంతో.. ఈ విభాగంలో 5 స్టార్‌ రేటింగ్‌ సొంతం చేసుకుంది. దీని ద్వారా జీవవైవిధ్యానికి జీవీఎంసీ పెద్దపీట వేసింది. 

►జీవీఎంసీ విస్తీర్ణం-625.47 చ.కిమీ
►పచ్చదనం పరచుకున్న విస్తీర్ణం 222.53 చ.కిమీ 

మురుగు నీటిని  శుద్ధి చేస్తూ..   
నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీటి వ్యర్థాల నిర్వహణలోనూ జీవీఎంసీ ప్రత్యేక చర్యలు అవలంబిస్తోంది. మురుగునీటిని శుద్ధి చేసేందుకు బయోరెమిడేషన్‌ పద్ధతుల్ని అవలంబిస్తోంది. ఈ కారణంగా ఈ విభాగంలో 3 స్టార్‌ రేటింగ్‌ సాధించింది. 
►నగరంలో ఉత్పన్నమవుతున్న మురుగునీరు    78 ఎంఎల్‌డీ 
►సివరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్స్‌(ఎస్‌టీపీ)    04 
►మినీ ఎస్‌టీపీలు    13 
►సివరేజ్‌లైన్‌ పొడవు    771 కి.మీ

స్టార్‌ రేటింగ్‌ బాధ్యత పెంచింది 
స్మార్ట్‌ సిటీ స్టార్‌ రేటింగ్స్‌లో విశాఖ నగరం మంచి రేటింగ్‌ సాధించడం ఆనందంగా ఉంది. నగర ప్రజలకు ఆరోగ్యకరమైన, గౌరవ ప్రదమైన జీవనాన్ని అందించేందుకు జీవీఎంసీ నిరంతరం శ్రమిస్తోంది. వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై మరింత దృష్టిసారిస్తున్నాం. థీమ్‌పార్కులు, మియావాకీ అడవుల నిర్మాణం చేపడుతున్నాం. నరవలో 108 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ సిద్ధం చేస్తున్నాం. స్టార్‌ రేటింగ్‌ జీవీఎంసీ అధికారులపై బాధ్యతని మరింత పెంచింది. 
– జి.సృజన, జీవీఎంసీ కమిషనర్‌ 

గ్రీన్‌ సిటీగా తీర్చిదిద్దుతున్నాం 
స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల విషయంలో జీవీఎంసీ రాజీపడటం లేదు. కమిషనర్‌ సూచనల్ని అనుసరించి.. ప్రాజెక్టుల్ని పూర్తి చేసే విషయంలో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నాం. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంపై ప్రధాన దృష్టిసారించాం. సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ గ్రీన్‌ సిటీగా విశాఖని తీర్చదిద్దుతున్నాం. 
– వినయ్‌కుమార్, జీవీఎంసీ స్మార్ట్‌సిటీ ఎస్‌ఈ 
 

మరిన్ని వార్తలు