వికసించిన ‘సౌర’ పుష్పం

16 Jul, 2022 23:32 IST|Sakshi
మేఘాద్రి గెడ్డలో ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్లాంట్‌

మేహాద్రిగెడ్డపై 3 మెగావాట్ల ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ 

రూ.14.04 కోట్లతో ఏర్పాటు చేసిన జీవీఎంసీ 

జూన్‌ 30 నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభం 

విశాఖ చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు 

ఏడాదికి 42 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి

ప్రాజెక్టు ద్వారా 54 వేల టన్నుల బొగ్గు వినియోగం ఆదా 

3,220 టన్నుల కర్బన ఉద్గారాల నియంత్రణ 

సహజ వనరుల వినియోగంలో జీవీఎంసీ రోల్‌ మోడల్‌గా వ్యవహరిస్తోంది. తన పరిధిలోని అన్ని వ్యవస్థల్లో సోలార్‌ విద్యుత్‌ వినియోగిస్తోంది. వినూత్నంగా ఆలోచిస్తూ విద్యుత్‌ బిల్లులు ఆదా చేయడంతో పాటు కర్బన ఉద్గారాలను నియంత్రించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. ముడసర్లోవలో రిజర్వాయర్‌లో దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌.. తాజాగా మేహాద్రిగెడ్డపై మరో ప్లాంట్‌ను పూర్తి చేసింది. రూ.14.04 కోట్లతో 3 మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌ నుంచి విద్యుదుత్పత్తి గత నెల 30 నుంచి ప్రారంభమైంది. 

సాక్షి, విశాఖపట్నం : సోలార్‌ విద్యుత్‌పై నగర ప్రజలకు అవగాహన కల్పించి.. సంప్రదాయ విద్యుత్‌ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు జీవీఎంసీ ఒక్కో ప్రాజెక్టు పూర్తి చేస్తోంది. ఇప్పటికే స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా ఏకంగా 7 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తయ్యేలా వివిధ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది. తమ పరిధిలో ఉన్న జీవీఎంసీ భవనాలపై విద్యుత్‌ ‘సౌర’భాలు పూయిస్తోంది.

నీటిపై సౌర ఫలకలు తేలియాడుతూ విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా దేశంలోనే అతి పెద్ద తొలి ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టును జీవీఎంసీ ఏర్పాటు చేసింది. ముడసర్లోవలో రిజర్వాయర్‌లో రూ.11.37 కోట్లతో 2 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టు నిర్మించింది. దేశంలో తొలి అతి పెద్ద ప్రాజెక్టుకు బెస్ట్‌ స్మార్ట్‌ సిటీ ఇన్నోవేషన్‌ అవార్డు దక్కింది. ఇప్పుడు దానికంటే పెద్ద ప్రాజెక్టును మేహాద్రి గెడ్డపై ఏర్పాటు చేసి.. ఔరా అనేలా చేసింది.  

రూ.14.04 కోట్లు.. 3 మెగావాట్లు 
2019 డిసెంబర్‌లో పనులు ప్రారంభించి, ఈ ఏడాది మార్చిలో పూర్తి చేశారు. రూ.14.04 కోట్లతో మొత్తం 3 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యంతో ప్రాజెక్టు సిద్ధమైంది. తడిచినా తుప్పుపట్టని, జర్మన్‌ టెక్నాలజీ కలిగిన అత్యాధునిక ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు. రెండు మీటర్ల పొడవు, ఒక మీటర్‌ వెడల్పు కలిగిన 9,020 ఫోమ్‌ టెక్నాలజీతో కూడిన ఎల్లో ట్రూపర్స్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేశారు.

గుర్‌గావ్‌కు చెందిన రెన్యూ సోలార్‌ సిస్టమ్‌ ప్రై. లిమిటెడ్‌ సంస్థ ఈ ప్రాజెక్టు పనులు చేపట్టింది. విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌(వీసీఐసీడీపీ)లో భాగంగా ఏసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌కి సంబంధించి అర్బన్‌ క్‌లైమేట్‌ చేంజ్‌ రెసిలియన్స్‌ ట్రస్ట్‌ ఫండ్‌(యూసీసీఆర్టీఎఫ్‌) నిధులతో ప్రాజెక్టు పూర్తి చేసింది. 

12 ఎకరాలు.. 40 శాతం నీరు ఆదా 
సాధారణంగా 3 మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్ట్‌ నిర్మించేందుకు 12 ఎకరాల విస్తీర్ణం అవసరం ఉంటుంది. కానీ మేహాద్రి రిజర్వాయర్‌లో నీటి ఉపరితలంపై ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో 12 ఎకరాలు ఆదా చేయగలిగారు. రిజర్వాయర్‌లోని 0.1 శాతం విస్తీర్ణంలో అంటే 0.005 చ.కి.మీ విస్తీర్ణంలో సోలార్‌ ప్యానల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్‌ నీటి ఉపరితలంపై ఉండటంతో రిజర్వాయర్‌లోని నీరు ఆవిరి కాకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా 40 శాతం వరకూ నీటిని కూడా ఆదా చేస్తుంది. 

మరో మైలురాయి అధిగమించాం.. 
ఇటీవల కాలంలో విద్యుత్‌ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో సౌర విద్యుత్‌పై దృష్టిసారించాం. విద్యుత్‌ ఆదా చేస్తే ప్రజలతో పాటు నగరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విషయంలో నగరవాసులకు ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతో ముందుగా జీవీఎంసీ నుంచే సోలార్‌ విద్యుత్‌ వినియోగం ప్రారంభిస్తున్నాం. మేహాద్రిగెడ్డపై రెండో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్టు మంచి ఫలితాలందిస్తోంది. 
– గొలగాని హరి వెంకటకుమారి, నగర మేయర్‌ 

ఐదేళ్లపాటు నిర్వహణ బాధ్యత 
కమిషనర్‌ సూచనల మేరకు పనులను త్వరితగతిన పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభించాం. మేహాద్రిగెడ్డపై ఫ్లోటింగ్‌ సోలార్‌ పవర్‌ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలను ఐదేళ్ల పాటు అప్పగించాం. 20 సంవత్సరాల పాటు చెక్కు చెదరకుండా ఆధునిక సాంకేతికతతో ప్యానెల్స్‌ ఏర్పాటు చేశాం. కార్పొరేషన్‌ ఏర్పాటు చేసిన ప్రాజెక్టులతో దాదాపు 20 వేల టన్నులకు పైగా కర్బన ఉద్గారాల్ని నియంత్రిస్తూ పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతున్నాం. 
– రవికృష్ణరాజు, జీవీఎంసీ చీఫ్‌ ఇంజినీర్‌

మరిన్ని వార్తలు