ఐటీ హబ్‌గా విశాఖలో అపారమైన అవకాశాలు 

29 Oct, 2022 13:29 IST|Sakshi

ద్వితీయశ్రేణి నగరాల్లో వైజాగ్‌.. డైనమిక్‌ సిటీ.. ఐటీ పరిశ్రమల చూపు టైర్‌–2 నగరాల వైపు  

ప్రోత్సాహకాలిస్తే విశాఖకు పరుగులు తీస్తాయి  

బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27% అయితే వైజాగ్‌లో 20 శాతం

‘సాక్షి’తో ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌కుమార్‌

సాక్షి, విశాఖపట్నం: ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు హబ్‌గా అభివృద్ధి చెందేందుకు విశాఖపట్నంలో అపారమైన అవకాశాలున్నాయని సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌కుమార్‌ చెప్పారు. సీఐఐ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ 4.0– అవకాశాలు, సవాళ్లు’ సదస్సులో పాల్గొనేందుకు ఆయన శుక్రవారం విశాఖ వచ్చారు.
చదవండి: ‘టెక్‌’ల కేంద్రంగా విశాఖ

ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ సి.వి.డి.రామ్‌ప్రసాద్‌తో కలిసి ఆయన సాక్షితో మాట్లాడారు. ఐటీ పరిశ్రమలన్నీ తమ తదుపరి డెస్టినేషన్‌గా ద్వితీయశ్రేణి నగరాల్ని ఎంపిక చేసుకుంటున్నాయని, ఇందులో మొదటి వరుసలో విశాఖపట్నం ఉందని చెప్పారు. ఆసియా–పసిఫిక్‌ ప్రాంతానికి డేటా సెంటర్‌ హబ్‌గా భారత్‌ అవతరించబోతోందన్నారు. అరవింద్‌కుమార్‌ ఇంకా ఏమన్నారంటే..

ఏపీ ఐటీ పాలసీ అద్భుతం
ఐటీ సర్వీస్‌ సెక్టార్‌ పరిశ్రమల ఏర్పాటుకు వైజాగ్‌ వంటి నగరాలే మొదటి ప్రాధాన్యం. విశాఖపట్నం ఒక డైనమిక్‌ సిటీ. కాస్త ప్రోత్సాహకాలు అందిస్తే.. ఐటీ రంగం మొత్తం విశాఖ వంటి నగరాల వైపు పరుగులు తీస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌  ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐటీ పాలసీ కూడా అద్భుతంగా ఉంది. మరిన్ని అవకాశాల కోసం పరిశ్రమలు ఎదురు చూస్తున్నాయి. చైనా, జపాన్‌ వంటి దేశాల పోటీని తట్టుకోవాలంటే వైజాగ్‌ వంటి టైర్‌–2 నగరాలని ఎంపిక చేసుకోవాల్సిందే.

బీపీవోల ఓటు వైజాగ్‌కే 
బిజినెస్‌ ప్రాసెస్‌ అవుట్‌సోర్సింగ్‌ (బీపీవో) కంపెనీలు కూడా ద్వితీయశ్రేణి నగరాల బాట పడుతున్నాయి. వీటి ఓటు కూడా వైజాగ్‌కే ఉందని  గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీపీవో సీట్స్‌లో ఏపీ వాటా 27 శాతం కాగా.. విశాఖపట్నం వాటా 20 శాతం ఉండటం గమనార్హం. ఇది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాల వల్ల సాధ్యమైంది. ఈ నేపథ్యంలో వైజాగ్‌లో ఎస్‌టీపీఐ సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించాం. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న కార్యాలయం కాకుండా మరో 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నాం.

2026 నాటికి 80 బిలియన్ల మార్కెట్‌ ఎస్‌టీపీఐ లక్ష్యం
ప్రస్తుతం ఎస్‌టీపీఐ సేవలను విస్తృతం చేశాం. వై2కే సమస్యని అధిగమించి అడుగులు వేయడం వల్లే.. ఎస్‌టీపీఐపై ప్రపంచవ్యాప్తంగా నమ్మకం ఏర్పడింది. అందుకే సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల ఎగుమతుల మార్కెట్‌లో 1992లో రూ.17 కోట్లు మాత్రమే ఉన్న మా వాటా.. ప్రస్తుతం రూ.5.69 లక్షల కోట్లకు చేరుకుంది. 2026 నాటికి 80 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. అదేవిధంగా సాఫ్ట్‌వేర్‌ సేవల మార్కెట్‌లోను రూ.227 కోట్ల వాటాను ఆర్జించాం.

సీవోఈలకు అమ్మలాంటి కల్పతరు
ఇప్పటికే ఎస్‌టీపీఐ 20 సెంటర్‌ ఆఫ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (సీవోఈ)లని దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. విశాఖపట్నంలోను సేవలందిస్తున్నాం. పరిశోధనలు, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు అన్ని విధాలా అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం కల్పతరు ప్రారంభించాం. ఏపీ ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామిగా ఉండటం హర్షదాయకం. సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తుల క్లస్టర్‌గా ఇది ఉపయుక్తమవుతుంది. ఇప్పటివరకు కల్పతరు ఇండస్ట్రీ 4.0 కోసం 250 దరఖాస్తులు వచ్చాయి.

డేటా సెంటర్‌ హబ్‌గా భారత్‌
ఆసియా–పసిఫిక్‌ ప్రాంతంలో డేటా సెంటర్‌ హబ్‌గా భారత్‌ అవతరించే అవకాశం ఉంది. ఇందుకు ఎస్‌టీపీఐ నుంచి సంపూర్ణ మద్దతు  అందిస్తున్నాం. డేటా సెంటర్లకు సంబంధించిన విధానాన్ని రూపొందించే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఈ పాలసీని అమలుచేసే ఏజెన్సీగా ఎస్‌టీపీఐ వ్యవహరిస్తుంది. ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, బ్లాక్‌చెయిన్‌ వంటి సాంకేతిక రంగాలపై దృష్టిసారిస్తున్నాం. 

మరిన్ని వార్తలు