రక్షణ శాఖ ఇలాకా.. విశాఖ

4 Dec, 2022 10:09 IST|Sakshi
టార్పెడోలు, (ఇన్‌సెట్‌)లో తొలి కాంపోజిట్‌ ఇండోర్‌ షూటింగ్‌ రేంజ్‌

భారత నేవీలో కీలక కేంద్రంగా విశాఖపట్నం

ఒడిశా నుంచి తమిళనాడు వరకు 15 స్థావరాల ద్వారా తీరగస్తీ

చురుగ్గా అండర్‌గ్రౌండ్‌ బేస్‌ వర్ష పనులు

నౌకాదళ ఆయుధ సంపత్తి పరీక్ష కేంద్రాలూ ఇక్కడే

సాక్షి, విశాఖపట్నం: శత్రు దేశమైన పాకిస్తాన్‌తో యుద్ధం జరిగితే.. ఆ యుద్ధంలో మన త్రివర్ణ పతాకం రెపరెపలాడితే.. ఆ చిరస్మరణీయ విజయానికి మన విశాఖ వేదికైతే.. ఎంత గర్వంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ విజయానికి గుర్తుగా ఏటా డిసెంబర్‌ 4వ తేదీన భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తున్నారు. జాతి గర్వించదగ్గ గెలుపునకు గుర్తుగా బీచ్‌ రోడ్‌లో ‘విక్టరీ ఆఫ్‌ సీ’ స్థూపం నిర్మించారు. 75 ఏళ్లలో భారత నౌకాదళం ప్రపంచంలోనే అతి పెద్ద దళాల్లో ఒకటిగా సమర్థమైన నౌకాదళ శక్తిగా మారగా.. దేశంలోనే ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకా దళం మారింది. 

దేశానికి తూర్పు తీరం వ్యూహాత్మక రక్షణ ప్రాంతం. సహజ సిద్ధమైన భౌగోళిక రక్షణతో పాటు శత్రు దేశాలకు సుదూరంగా ఉండటం తూర్పు నౌకాదళం ప్రత్యేకత. అందుకే రక్షణ అవసరాల దృష్ట్యా బ్రిటిష్‌ పాలకులు విశాఖపట్నాన్ని కీలకంగా భావించారు. ఇందులో భాగంగానే విశాఖలో తూర్పు నావికా దళం ఏర్పాటైంది. 1923 డిసెంబర్‌లో విశాఖను తూర్పు తీరంలో వ్యూహాత్మక కేంద్రంగా గుర్తించారు.

రెండో ప్రపంచ యుద్ధ కాలమైన 1942–45 మధ్య కాలంలో విశాఖ తీరాన్ని ప్రధానంగా వినియోగించుకున్నారు. ఇక్కడి నుంచే బర్మాకు ఆయుధాలను రవాణా చేశారు. స్వాతంత్య్రానంతరం 1954లో విశాఖ నేవీ పోస్ట్‌ను కమాండర్‌ హోదాకు పెంచుతూ.. బేస్‌ రిపేర్‌ ఆర్గనైజేషన్‌ కార్యకలాపాలు ప్రారంభించారు. 1962లో ఇండియన్‌ నేవీ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఐఎన్‌హెచ్‌ఎస్‌) కల్యాణి ప్రారంభమైంది.

1967 జూలై 24న కమాండర్‌ హోదాను రియర్‌ అడ్మిరల్‌ హోదాకు అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు తూర్పు తీరంలో ఫ్లాగ్‌ ఆఫీసర్స్‌ పోస్టులను మంజూరు చేశారు. 1968 మార్చి 1న విశాఖ ప్రధాన కేంద్రంగా తూర్పు నౌకాదళం (ఈఎన్‌సీ) కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 1971 మార్చి 1న ఈఎన్‌సీ చీఫ్‌గా వైస్‌ అడ్మిరల్‌ నియామక శకం మొదలైంది. క్రమక్రమంగా ఈఎన్‌సీ విస్తరించింది. 1971 నవంబర్‌ 1 నుంచి ఈఎన్‌సీ ఫ్లీట్‌ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. తొలి ఈఎన్‌సీ చీఫ్‌గా రియర్‌ అడ్మిరల్‌ కేఆర్‌ నాయర్‌ నియమితులయ్యారు.

రక్షణలో వెన్నెముక
పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి వరకూ 2,600 కి.మీ. నిడివి కలిగిన తూర్పు తీరంలో 30 శాతం అంటే.. 6 లక్షల చ.కి.మీ. పరిధిలో ఎక్స్‌క్లూజివ్‌ ఎకనమిక్‌ జోన్‌ విస్తరించి ఉంది. ఈ తీరంలో 13 మేజర్‌ పోర్టులున్నాయి. భారత సర్కారు లుక్‌ ఈస్ట్‌ పాలసీ ప్రవేశపెట్టిన తర్వాత.. సముద్ర వాణిజ్యానికి తూర్పు తీరం ప్రధాన కేంద్రంగా మారడంతో వాణిజ్య నౌకల రక్షణ బాధ్యత కూడా తూర్పు నౌకాదళమే నిర్వర్తిస్తోంది.

దీంతోపాటు డీఆర్‌డీవో కార్యకలాపాలకు కూడా తూర్పు తీరమే వేదికగా మారింది. పలు క్షిపణులు తయారు చేసే నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నొలాజికల్‌ లేబొరేటరీస్‌(ఎన్‌ఎస్‌టీఎల్‌) విశాఖలోనే ఏర్పాటైంది. ఇలా ఈఎన్‌సీ విస్తరించుకుంటూ బలీయమైన శక్తిగా మారింది. తీర ప్రాంత రక్షణలో వెన్నెముకగా ఉన్న ఈఎన్‌సీ.. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన నౌకలతో పాటు విదేశాల నుంచి కొనుగోలు చేసిన యుద్ధ నౌకలతో ఇండియన్‌ నేవీ.. ఎప్పటికప్పుడు నౌకా సంపత్తిని పెంచుకుంటూ.. శత్రుదుర్బేధ్యంగా మారుతోంది. తూర్పు నౌకాదళం పరిధిలో 40 వరకూ యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్‌లున్నాయి.

అస్త్ర పరీక్షల కేంద్రం
నౌకాదళ ఆయుధ పరీక్షలకు విశాఖ కేంద్ర బిందువుగా మారనుంది. ప్రధానంగా సముద్రంలో జరిగే యుద్ధాల్లో వినియోగించే ఆయుధాల పరీక్ష కేంద్రాన్ని రక్షణ శాఖ నెలకొల్పుతోంది. ఇలాంటి కేంద్రం దేశంలో విశాఖలోనే ఏర్పాటు కానుండటం గమనార్హం. అలాగే క్షిపణులు, రాకెట్ల పరీక్ష కేంద్రం కూడా ఇక్కడ నిర్మితమవుతోంది. దేశంలోనే తొలిసారిగా భారీ టార్పెడోలు, అండర్‌ వాటర్‌ వెపన్స్‌ పరీక్షా కేంద్రాన్ని భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌ (బీడీఎల్‌) భీమిలిలో నిర్మించనుంది.

తొలి కాంపోజిట్‌ ఇండోర్‌ షూటింగ్‌ రేంజ్‌ 
సెయిలర్స్‌లో ఫైరింగ్‌ స్కిల్స్‌ పెంపొందించడం కోసం భారత నౌకాదళం అత్యాధునిక సాంకేతికతతో లైవ్‌ ఫైరింగ్‌ సిస్టమ్‌ను నిర్మించింది. విశాఖ కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళంలో ఈ సౌకర్యాన్ని ఈఎన్‌సీ చీఫ్‌ వైస్‌ అడ్మిరల్‌ బిస్వజిత్‌ దాస్‌ గుప్తా ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా  దీన్ని నిర్మించారు.
చదవండి: Viral: సీఎం జగన్‌ ప్రమాణ స్వీకారం వీడియో చూస్తూ ఆపరేషన్‌   

మరిన్ని వార్తలు