విశాఖ పోలీస్‌ సంచలన నిర్ణయం.. నగరంలో తొలిసారి..

3 Nov, 2022 10:27 IST|Sakshi

గూండాయిజం చేస్తున్న కిరణ్‌కు సీపీ శ్రీకాంత్‌ నోటీసు  

రోబరీ, కిడ్నాప్, కొట్లాటలు.. ఇలా అనేక కేసుల నమోదు 

అతడి కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రమాదమని గుర్తింపు    

నగరంలో సంచలనంగా తొలిసారి బహిష్కరణ నిర్ణయం

సాక్షి, దొండపర్తి / మధురవాడ (భీమిలి): నగరంలో నేర నియంత్రణపై పోలీస్‌ శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమిస్తోంది. ముఖ్యంగా రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి వరకు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్‌ పెట్టిన పోలీస్‌ శాఖ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

విశాఖలో తొలిసారిగా ఒక రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి నేరాలకు పాల్పడే వారి వెన్నులో వణుకు పుట్టించింది. పీఎం పాలెం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గూండాయిజం చేస్తున్న రౌడీషీటర్‌ పెంటకోట కిరణ్‌(19)ను నగరం నుంచి ఆరు నెలలపాటు బహిష్కరిస్తూ నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ బుధవారం నోటీసులు జారీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఎం పాలెం ఆర్‌హెచ్‌ కాలనీకి చెందిన కిరణ్‌ ఇంటర్‌ వరకు చదివాడు. వ్యసనాలకు బానిసై శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ చట్టవ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం ప్రారంభించాడు. పీఎంపాలెం స్టేషన్‌ పరిధిలో రోబరీ, కిడ్నాప్, కొట్లాట ఇలా అనేక నేరాలకు కిరణ్‌ పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఐపీసీ 297, 324, 425, 364 – ఏ, 342, 323, 384, 120బి, 34తోపాటు 428, 392 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.

రౌడీషీట్, హిస్టరీ షీట్‌తోపాటు ఎన్నికేసులు ఉన్నప్పటికీ కిరణ్‌ నిత్యం నేరాలు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అంతేకాకుండా గూండాయిజం చేస్తూ ప్రజలను బెదిరించడంతోపాటు  దాడులకు పాల్పడుతున్నాడు. గత 6 నెలలుగా కిరణ్‌ కదలికలు, కార్యకపాలపై పోలీసులు నిఘా పెట్టారు. అతడి నుంచి ప్రజలకు, వారి ఆస్తులకు ప్రమాదముందని భావించారు. అతడిపై కేసులు పెట్టే వారితోపాటు, సాక్షులను బెదిరిస్తుండడంతో కిరణ్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి ప్రజలు భయపడుతుండడాన్ని గుర్తించారు. దీంతో నగర పోలీస్‌ కమిషనర్‌ సీహెచ్‌.శ్రీకాంత్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు. పెంటకోట కిరణ్‌ను షరతులతో అక్టోబర్‌ 31వ తేదీ నుంచి 6 నెలలపాటు విశాఖ కమిషనరేట్‌ పరిధి నుంచి బహిష్కరిస్తూ నోటీసు అందించారు. 

రౌడీషీటర్లకు వెన్నులో వణుకు 
నగరంలో జరుగుతున్న నేరాలు, హత్యలతో పోలీసులు రౌడీషీటర్లపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఒకవైపు గంజాయి, ఇతర మత్తు పదార్థాలు సేవిస్తున్న, సరఫరా చేస్తున్న వారిపై నిఘా పెట్టి వారిని వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అలాగే నిర్మాణుష్య ప్రాంతాల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం, ఇతర నేరాలకు పాల్పడుతున్న వారిని నిరంతరం గమనిస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్‌ నమోదు చేసిన పోలీసులు తొలిసారిగా రౌడీషీటర్‌ను నగరం నుంచి బహిష్కరించి సంచలనం సృష్టించారు. నగరంలో నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తూ రౌడీషీటర్ల వెన్నులో వణుకు పుట్టించారు.  

ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు 
నగరంలో రౌడీయుజం, గూండాయుజం, నేరాలకు పాల్పడితే సహించేది లేదు. నగర ప్రశాంతతకు, భద్రతకు భంగం కలిగించే వారెవరైనా ఉపేక్షించేది లేదు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. విశాఖలో నేర నియంత్రణకు, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. 
– సీహెచ్‌.శ్రీకాంత్, నగర పోలీస్‌ కమిషనర్‌

మరిన్ని వార్తలు