విశాఖ సురక్షితం.. ఉపద్రవం ఉత్తదే

18 Aug, 2021 04:02 IST|Sakshi
విశాఖ తీరం

సముద్రమట్టానికి 25 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో వైజాగ్‌

నాసా చెబుతున్న నీటి మట్టం పెరుగుదల 0.53 మీటర్లు మాత్రమే

అది కూడా ఎప్పుడో వందేళ్ల తరువాత 

దీనివల్ల నగరం మునిగిపోయే ప్రమాదం ఏమాత్రం లేదంటున్న శాస్త్రవేత్తలు

తీరం కోతకు గురి కావడం ప్రపంచవ్యాప్తంగా సర్వ సాధారణమే

నివారణ చర్యలపై ప్రత్యేకంగా దృష్టిసారించిన రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, విశాఖపట్నం: ‘‘దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లో అత్యంత సురక్షిత నగరాల్లో విశాఖ ముందు వరుసలో ఉంటుంది. వందేళ్ల తర్వాత ఒకటి రెండు అడుగులు సముద్రమట్టం పెరిగినా ముంపునకు గురవుతుందన్న ఆందోళనైతే ఏమాత్రం లేదు..’’ ఇదీ జాతీయ సముద్ర అధ్యయన సంస్థ(ఎన్‌ఐఓ) విశ్రాంత శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు తేల్చి చెబుతున్న మాట. ‘నాసా’ అధ్యయనం ప్రకారం సముద్ర మట్టం పెరుగుతుందన్న ఆందోళన ఉన్నప్పటికీ అది స్వల్పంగా ముందుకు చొచ్చుకు వచ్చే వరకు మాత్రమే ప్రభావం ఉంటుంది కానీ విశాఖకు ముంపు ముప్పు ఉందన్న అవాస్తవ ప్రచారాలను ఎవరూ విశ్వసించవద్దని సూచిస్తున్నారు. 

భూతాపంతో..
నానాటికీ పెరుగుతున్న భూతాపం మానవాళిని అంపశయ్యపై ఉంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా సముద్ర మట్టాలు పెరుగుతాయని ఐక్యరాజ్యసమితి నియమించిన  కమిటీ (ఐపీసీసీ) తాజా నివేదికలో వెల్లడించింది. భూతాపం వల్ల ఉత్తర ధృవంలోని ఆర్కిటిక్‌ సముద్రంలో పలకలు క్రమంగా కరుగుతూ నీరుగా మారి సముద్రంలో చేరుతున్నాయని, దీనివల్ల నీటి మట్టాలు క్రమంగా పెరుగుతాయని పేర్కొంది. సముద్ర మట్టాలు పెరగడం వల్ల 2100 సంవత్సరంలో దేశంలోని కొచ్చి, భావ్‌నగర్, ముంబై, మంగళూరు, చెన్నైతో పాటు విశాఖపట్నంలోనూ సముద్ర మట్టాలు పెరిగే ముప్పు ఉందని హెచ్చరించింది. అయితే దీన్ని పట్టుకుని విష కథనాలు వండి వార్చేస్తూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు నాసా చెప్పిన నిజమేంటి..? విశాఖకు నిజంగానే ఉపద్రవం ఉందా? అనే విషయాలను ఓసారి పరిశీలిద్దాం..

నాసా ఏం చెప్పిందంటే..?
1988 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు, సముద్ర స్థితిగతులు, కర్బన ఉద్గారాలు మొదలైన అంశాలపై ఐపీసీసీ అధ్యయనం చేసి ఐక్యరాజ్యసమితికి నివేదిక అందిస్తోంది. విశ్వవ్యాప్తంగా భూతాపం పెరుగుతుండటం వల్ల భవిష్యత్తులో మానవాళికి పెనుముప్పు ఎదురుకానుందని ఈ ఏడాది సర్వేలో హెచ్చరించింది. హిమనీ నదాలు కరిగి సముద్రంలో కలుస్తుండటం ఒక పరిణామమైతే, రుతుపవనాల్లో మార్పులు, భారీ తుపాన్లు కారణంగా వరదనీరు సముద్రంలోకి భారీగా చేరి నీటి మట్టాలు పెరగనున్నాయి. ఈ క్రమంలో విశాఖపట్నంలో రానున్న వందేళ్లలో 1.77 అడుగుల ఎత్తున సముద్ర నీటి మట్టం పెరిగే అవకాశం ఉందన్నది సారాంశం.

విశాఖలో వాస్తవమేంటి..?
నాసా చెప్పింది నిజమే. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా సముద్రం ఉప్పొంగనుంది. ఫలితంగా మట్టాలు పెరిగి ముందుకు చొచ్చుకొచ్చే ప్రమాదం ఉంది. 2019లో ఎన్‌ఐవో నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2100 నాటికి ప్రస్తుత సముద్ర మట్టం కంటే 70 సెంటీమీటర్లు పెరిగే సూచనలున్నాయని వెల్లడించింది. ఇదే విషయాన్ని ఐపీసీసీ స్పష్టం చేసింది. ఇదే జరిగితే కోస్తా తీరంలో వందల కిలోమీటర్లు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అయితే మరో 500 లేదా 600 ఏళ్ల వరకూ విశాఖకు ముంపు ముప్పు లేదన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే విశాఖ నగరం సముద్ర మట్టానికి 25 మీటర్ల ఎత్తులో ఉంది. వందేళ్ల తర్వాత నీటి మట్టం పెరిగేది కేవలం 1.77 అడుగులు. అంటే 0.532 మీటర్లు మాత్రమే. . దీనివల్ల విశాఖ మునిగిపోయే ప్రమాదం ఏమాత్రం లేదని శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు స్పష్టం చేస్తున్నారు. తీరం కోతకు గురవడం సాధారణమని పేర్కొంటున్నారు. విశాఖకు భూకంపాలు, సునామీలు వచ్చే ప్రమాదాలు లేవు. టెక్టానిక్స్‌ ప్రకారం లక్షల సంవత్సరాలకు జరగవచ్చన్నది ఒక అంచనా మాత్రమేనని చెబుతున్నారు.

తీరం ఎందుకు కోతకు గురవుతుంది..?
పరిశ్రమలు, వాహనాలు, యంత్రాల నుంచి వెలువడే కార్బన్‌ డయాక్సైడ్, మిథేన్, నైట్రస్‌ ఆక్సైడ్‌ లాంటి వాయువులు భూ ఉపరితల వాతావరణంలో వలయంలా ఏర్పడ్డాయి. ఈ వలయం భూమి నుంచి బయటకు వెళ్లాల్సిన ఉష్ణోగ్రతను బంధించేయడాన్ని గ్రీన్‌ హౌస్‌ ఎఫెక్ట్‌ అంటారు. దీనివల్ల భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయి వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే గ్లోబల్‌ వార్మింగ్‌ అని చెబుతారు. పోర్టులు, రిగ్గులు, హార్బర్లు కారణంగా సముద్రంలో సహజసిద్ధంగా ఉన్న నీటి గమనంపై ప్రభావితం చూపుతున్నాయి. దీనివల్ల ఇసుక ప్రవాహానికి అవరోధం ఏర్పడి కొన్ని తీరాల్లో మేట వేయడం, మరికొన్ని తీరాలు కోతకు గురవడం జరుగుతున్నాయి. దీంతో పాటు వరదలు, హిమనీ నదాల నుంచి నీటి ప్రవాహం పెరుగుతుండటం వల్ల సముద్ర మట్టం పెరుగుతోంది. 

ఆ నివేదిక ఓ అంచనా మాత్రమే..
ఐపీసీసీ నివేదికలు కేవలం వాతావరణంలో మార్పులను తెలుసుకునేందుకు ఉపయోగపడతాయే కానీ శాస్త్రీయపరంగా రుజువైనవి కాదన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలి. గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల సముద్ర మట్టాలు పెరిగే అవకాశాలున్నాయి. అదంతా దీర్ఘకాలిక ప్రభావం. ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోయేంత ప్రమాదమేమీ లేదు. పైగా సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్ల అలాంటి భయాందోళనలు అనవసరం. హిమనీ నదాలు కరగడం వల్ల వచ్చే నీరు మయన్మార్‌ తీరంపై ముందుగా ప్రభావం చూపుతుంది. దీనివల్ల పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటుంది తప్ప ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై ప్రభావం తక్కువగా ఉంటుంది. ఓ సంస్థ నివేదికను పట్టుకుని ఇప్పటికిప్పుడు విశాఖ మునిగిపోతుందని ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థం కావడంలేదు.
– ప్రొ.సునీత, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మెట్రాలాజీ, ఓషనోగ్రఫీ పూర్వ హెచ్‌ఓడీ 

తీర భద్రతకు ప్రమాదం లేదు
కోస్తా తీరంలో 2000 మీటర్ల వరకూ జరుగుతున్న పరిణామాలు, సముద్రంలో మార్పులపై పరిశోధనలు జరుగుతున్నాయి. గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ఏటా కొద్ది సెం.మీ. మేర సముద్ర మట్టం పెరుగుతుంది. దీనివల్ల తీరం కోతకు గురవుతుంది తప్ప నగరం మునిగిపోయేంత ప్రమాదం ఉండదు. ఎప్పుడో వందేళ్లకు సముద్రం కొంత ముందుకు వచ్చినా బీచ్‌ రోడ్డు వరకూ వచ్చే ఆస్కారం ఉంది తప్ప నగరంలోకి చొచ్చుకు రాదన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. గ్లోబల్‌ వార్మింగ్‌ మూలంగా తీరంలోని పారాదీప్, బంగ్లాదేశ్‌ తీరాలు ఎక్కువ కోతకు గురవుతాయి. తూర్పు కనుమలు ఉండటం వల్ల విశాఖ నగరానికి, తీర భద్రతకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదు.
– డా. కేఎస్‌ఆర్‌ మూర్తి, ఎన్‌ఐఓ రిటైర్డ్‌ సైంటిస్ట్‌

కోతను నియంత్రించే అవకాశాలున్నాయా?
తీరం కోతను నియంత్రించేందుకు అనేక అవకాశాలున్నాయి. దీనిపై చాలా అధ్యయనాలు జరిగాయి. ఆ ప్రాంత తీరం, భౌగోళిక, సముద్రం పరిస్థితులను అనుసరించి వివిధ పద్ధతులను అవలంబిస్తుంటారు. ప్రస్తుతం విశాఖ తీరంలో డ్రెడ్జింగ్‌ చేపడుతున్నారు. కోతకు గురికాకుండా చాలా ప్రాంతాల్లో సీ వాల్స్‌ (సముద్రపు గోడలు) నిర్మిస్తున్నారు. బీచ్‌ ఫ్రంట్‌ రీ డెవలప్‌మెంట్‌లో భాగంగా ఆర్కే బీచ్‌లో 3 కి.మీ. మేర సీవాల్‌ నిర్మించేందుకు జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. దీనికి సీఆర్‌జెడ్‌ అనుమతులు రావాల్సి ఉంది. కోతను నియంత్రించేందుకు అనుసరిస్తున్న వివిధ పద్ధతులు ఇవీ..

గ్రోయెన్స్‌:  సముద్ర ప్రవాహ అవక్షేప కదలికలను పరిమితం చేస్తూ కోతకు గురవుతుండగా ఏర్పాటు చేసే దృఢమైన హైడ్రాలిక్‌ నిర్మాణమిది. చెక్క, కాంక్రీట్‌ లేదా రాతితో గ్రోయెన్స్‌ నిర్మిస్తారు. స్పెయిన్‌లోని కేటలోనియా, నెదర్లాండ్స్, ఇంగ్లండ్, బ్రిటిష్‌ కొలంబియా, పోలాండ్‌ బీచ్‌లలో ఏర్పాటు చేశారు.
కర్వ్‌డ్‌ సీ వాల్‌: అలల తీవ్రతను తగ్గించి తీరం కోతకు గురికాకుండా కర్వ్‌డ్‌ సీ వాల్స్‌ నిర్మిస్తారు. వక్రంగా ఉండే ఈ గోడలు కెరటాల తీవ్రతను బలహీనపరచడం ద్వారా ఇసుక కొట్టుకుపోకుండా నియంత్రిస్తుంది. ఫలితంగా తీరం కోతకు గురికాదు. యూకే, పోలాండ్‌లోని బీచ్‌లలో వీటిని నిర్మించారు.
మౌండ్‌ సీవాల్‌: కాంక్రీట్‌ బ్లాక్స్, రాళ్లతో తక్కువ ధరతో వీటిని నిర్మించవచ్చు. ఈ బ్లాక్స్‌ను అలలు తాకి.. బ్లాక్స్‌ మధ్యలో ఉన్న ఖాళీల్లోకి వెళ్లడం వల్ల వాటి తీవ్రత పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా తీరం కోతకు గురికాకుండా ఉంటుంది. ఇవి నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌ తీరాల్లో ఉన్నాయి.
బ్రేక్‌ వాటర్‌: అలలను ఒడ్డుకు చేరకముందే చీల్చడం వల్ల వాటి తీవ్రత తగ్గి సముద్రం ప్రశాంతంగా ఉంటుంది. ఫలితంగా కోత సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇందుకు బ్రేక్‌వాటర్‌ సిస్టమ్‌ను అవలంబిస్తున్నారు. రాళ్లు, కాంక్రీట్‌ దిమ్మెలతోనూ ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఇవి విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలోనూ, పోర్టు పరిసరాల్లో ఉన్నాయి. 
వెర్టికల్‌ సీ వాల్‌: సముద్రంలో ఆటుపోట్ల సమయంలో తరంగాల ఉధృతిని తట్టుకునేందుకు వీటిని నిర్మిస్తారు. భారీ అలలను కూడా నియంత్రించగల సామర్థ్యం వెర్టికల్‌ సీ వాల్స్‌కి ఉంటుంది. ఇవి ప్రస్తుతం ఆస్ట్రేలియా, ముంబై తీరాల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు