బ్లాక్‌లో రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల విక్రయం 

21 Apr, 2021 18:12 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం : కరోనా రోగులకు ఇచ్చే రెమిడెసివిర్‌ ఇంజక్షన్ల బ్లాక్‌ మార్కెట్‌ దందా విశాఖలో చాపకింద నీరులా సాగిపోతోంది. ఇప్పటికే నగరంలోని ఓమ్ని ఆర్కే సిబ్బంది ఈ ఇంజక్షన్లను బ్లాకులో విక్రయిస్తూ పట్టుబడడం తెలిసిందే. తాజాగా అక్కయ్యపాలెంలోని స్పెషాలిటీ ఫార్మా స్యూటికల్స్‌ అధినేత ఈశ్వరరావుపై ఇదే వ్యవహారంలో జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇతను బిల్లులు ఇవ్వకుండానే 36వైల్స్‌కి చెందిన ఇంజక్షన్లను అక్రమంగా కొందరు వ్యక్తులకు విక్రయించినట్టు అధికారుల తనిఖీలలో తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెమిడెసివిర్‌ ఇంజక్షన్లను ఫార్మాస్యూటికల్స్‌ నిర్వాహకులు ఆస్పత్రులకు మాత్రమే విక్రయించాలి.

కానీ, ఈశ్వరరావు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నేరుగా వ్యక్తులకు ఇంజక్షన్లను విక్రయించినట్టు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు యుగంధర్, లలితల తనిఖీలలో తేలింది. గతంలో ఈ ఇంజక్షన్లు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు ఎంఆర్‌పీ రూ.5,400గా నిర్ణయించారు. ప్రజల వినతి మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవలే ఈ ఇంజక్షన్‌ ధరను రూ.2500గా నిర్ణయించారు. ఈశ్వరరావు మాత్రం ఒక్కో ఇంజక్షన్‌ను రూ.7వేలకు విక్రయించినట్టు అధికారులు చెబుతున్నారు. 

2,200 రెమిడెసివిర్‌ వయల్స్‌ స్వాధీనం
ముంబై: ముంబైలోని రెండు ప్రాంతాల్లో పోలీసులు, అధికారులు సంయుక్తంగా జరిపిన సోదాల్లో ఎగుమతిదారులు నిల్వ ఉంచిన 2,200 రెమిడెసివిర్‌ వయల్స్‌ పట్టుబడ్డాయి. దక్షిణ ముంబైలోని న్యూ మెరైన్‌ లైన్స్, సబర్బన్‌ అంధేరీల్లోని రెండు ప్రాంతాల్లో ఇవి లభ్యమయ్యాయని అధికారులు తెలిపారు. కోవిడ్‌–19 బారినపడి పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లకు రెమిడెసివిర్‌ ఔషధాన్ని వాడతారు. కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోవడంతో రెమిడెసివిర్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఔషధం ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేస్తూ గత వారం కేంద్రం ఆదేశాలిచ్చింది. అయితే, రెమిడెసివిర్‌ను విదేశాలకు ఎగుమతి చేసే కొన్ని సంస్థలు అక్రమంగా నిల్వ ఉంచాయనే సమాచారం మేరకు మంగళవారం ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారులు, పోలీసులు సోదాలు చేపట్టారు. 

చదవండి: ప్లీజ్‌..‌ పరిస్థితి అర్థం చేసుకోండి : ప్రియాంక చోప్రా విజ్ఞప్తి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు