న్యాయదిగ్గజం జగన్నాథం మృతి

5 May, 2021 10:45 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ న్యాయవాద దిగ్గజం, సీనియర్‌ న్యాయవాది లంక జగన్నాథం (73) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. కొద్దిరోజులుగా నగరంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. విశాఖ న్యాయవాదులకు పెద్ద దిక్కైన జగన్నాథం 1949లో జన్మించారు. ఏవీఎన్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేసి, ఏయూ న్యాయ కళాశాల నుంచి న్యాయశాస్త్ర పట్టాను అందుకున్నారు. 1973లో న్యాయవాదిగా తన ప్రస్థానం ప్రారంభించి, తండ్రి దివంగత న్యాయవాది లంక వెంకటేశ్వర్లు వద్ద ప్రాథమిక మెళకువలు నేర్చుకున్నారు. విశాఖ జిల్లా కోర్టులో నాటి నుంచి న్యాయవాదిగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు.

జగన్నాథానికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విశాఖ న్యాయవాదుల సంఘంలో ఐదు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా ఉన్న ఆయన అనేక ప్రముఖ సంస్థలకు సలహాదారుగా వ్యవహరించారు. ఏయూ, ఏవీఎన్‌ కళాశాల, ప్రభుత్వ రంగ బ్యాంకులు, జీవీఎంసీ, పలు బీమా సంస్థలకు స్టాండింగ్‌ కౌన్సిల్‌గా పనిచేశారు. శంకరమఠం, శ్రీ రామాయణ ప్రవచన సంఘం వంటి ధార్మిక సంస్థలకు ఆయన అద్యక్షుడిగా పనిచేశారు. దిగువ, హైకోర్టులో పలు ప్రముఖ కేసులలో తన ప్రతిభతో మార్గదర్శిగా నిలచారు. తండ్రి వెంకటేశ్వర్లు బాటలో నడిచి, ఎందరో జూనియర్‌ న్యాయవాదులకు దారిచూపారు. 

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం 
చూడగానే చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ఆప్యాయంగా పలకరించి, రెండు చేతులు జోడింగ్‌ నమస్కరించే మంచి మనిషి నేడు కనుమరుగయ్యారు. లంక జగన్నాథం మృతితో పెద్ద దిక్కును కోల్పోయామని పలువురు సీనియర్‌ న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు.  

పలువురి సంతాపం... 
లంక జగన్నాథం మృతి పట్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవధానం హరిహరనాథ శర్మ, విశాఖ న్యాయవాదుల సంఘం అద్యక్షుడు జి.ఎం రెడ్డి, ఇతర సీనియర్‌ న్యాయవాదులు సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవాది లంక జగన్నాథం మృతికి ప్రముఖ న్యాయవాదులు కేవీ రామ్మూర్తి, చీమల పాటి శ్రీరామమూర్తి, ఎం.కె సీతారామయ్య, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ ఉపాద్యక్షుడు కె.రామ జోగేశ్వర రావు, ఎస్‌.క్రిష్ణమోహన్, శిష్ట్ల శ్రీనివాస మూర్తి సంతాపం ప్రకటించారు.  

చదవండి: నకిలీ వకీలు: కోర్టులో ప్రశ్నలకు తడబడటంతో..

మరిన్ని వార్తలు